మణికొండ, ఆగస్టు 22: మణికొండ మున్సిపాలిటీలో బీజేపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజా సమస్యలపై స్పందించకపోవడం, పార్టీ అధిష్టాన ఒత్తిడి, ఒంటెత్తు పోకడ నిర్ణయాలను జీర్ణించుకోలేని ఆ పార్టీ కౌన్సిలర్ సోమవారం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొన్నాళ్లుగా బీజేపీ ప్రజా సమస్యలను విస్మరిస్తుండటం నచ్చకనే బీజేపీకి రాజీనామా చేసి తన అనుచరులతో కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ సమక్షంలో సోమవారం మైలార్ దేవ్పల్లిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద సుమారు 200 మంది కార్యకర్తలతో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనే మాటలకు పూర్తిస్థాయి నిర్వచనం ఇచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమం కోరుకునే ప్రతి నాయకుడు టీఆర్ఎస్లోకి వస్తారన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలంటే అధికార పార్టీ మద్దతు ఉంటే మున్సిపాలిటీని మరింతగా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. అందుకే బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశానని, బీజేపీలో కొంత మంది నాయకుల ఒత్తిడి, వారి విధానాలు నచ్చకనే రాజీనామా చేశానన్నారు. మరి కొంత మంది బీజేపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని త్వరలోనే వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ కె.రామకృష్ణారెడ్డి, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖా యాదగిరి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బి.శ్రీరాములు, కౌన్సిలర్లు కావ్య, వసంత్ చౌహాన్, పి.శైలజ, నాయకులు నీలేష్ ప్రసాద్ దూబే, ప్రమోద్‌రెడ్డి, జయరాజ్, బషీర్, నాయుడు, కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.