సికింద్రాబాద్, జులై13: విశిష్టమైన తెలంగాణ సంస్కృతికి బోనాలు వేడుకలు ప్రతీకలుగా నిలుస్తాయని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. మోండా మార్కెట్లోని టకార బస్తీలో ఆదివారం బోనాలు వేడుకల్లో పద్మారావు గౌడ్ తన కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేందుకు వివిధ సంప్రదాయాలను గౌరవించాల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వ హయంలోనే బోనాలు వేడుకలకు ప్రాముఖ్యత పెరిగిందని ఆయన తెలిపారు.
పద్మారావు గౌడ్ తో పాటు ఆయన కుమారులు తీగుల్ల కిషోర్ కుమార్ గౌడ్, కిరణ్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ లు తదితరులు పాల్గొన్నారు. మోండా మార్కెట్ లో పద్మారావు కుటుంబ సభ్యులకు చెందిన ఆలయంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎంఎల్ సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, కార్పొరేటర్లు హేమ, ప్రసన్న లక్ష్మి , శైలజ, సునీత తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆనందంగా బోనాలు వేడుకలు జరుపుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.