శామీర్‌పేట, ఏప్రిల్ 22: మన పార్టీ, మన అభ్యర్థి, మన భవిష్యత్ కోసం పోరు చేయాల్సిన అవసరమున్నదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. శామీర్‌పేట మండలం అలియాబాద్లోని సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కార్యకర్తల భవిష్యత్‌కు ఎంతో ముఖ్యమన్నారు. 20 రోజులు మన పార్టీ, మన అభ్యర్థి, మన భవిష్యత్ కోసం కంకణబద్ధులై పని చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోలేదని, కొన్ని ప్రాంతాల్లో చిన్నచిన్న కారణాలతో మాత్రమే మనం అధికారంలోకి రాలేకపోయామన్నారు.
శ్రేణులంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూనే.. కాంగ్రెస్ పార్టీ చెప్పిన దొంగమాటలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. గ్రామ గ్రామానా రచ్చబండలు, చౌరస్తాలు, కూడళ్ల వద్ద చర్చలు పెట్టాలన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను వివరించి ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరమున్నదన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఏ పని చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, స్కూటీలు వంటివి మహిళల కోసం కురిపించిన వరాల జల్లులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
హామీలను నెరవేర్చడంలో ఎవరైనా అడ్డుపడ్డారా అని ప్రశ్నించారు. దొంగమాటలు చెప్పుకుంటూ.. పబ్బం గడిపుకోవడం మానేసీ చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ ఉంటుందని ఎమ్మెల్యే మల్లారెడ్డి వెల్లడించారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ‘రాజకీయ పునర్ జన్మనిచ్చిన మల్కాజిగిరినే మరిచిపోయిన చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది. మల్కాజిగిరి ఎంపీగా గెలిచి ప్రజలను ఒక్కరోజైనా పలకరించిన పాపన పోలేదు.
రేవంత్‌రెడ్డికి కొడంగల్‌లో ఘోర పరాభవం తర్వాత రాజకీయ పునర్ జన్మనిచ్చింది మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలే. కానీ రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ప్రాంతానికి చేసిన ఒక్క పనినైనా ఉందా..? ముఖ్యమంత్రి కాగానే కొడంగల్‌కు రూ.3500 కోట్లు మంజూరు చేసుకున్నారు. మల్కాజిగిరి ప్రాంతం, ప్రజలు కనిపించకపోవడం సిగ్గుచేటు’. అని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, మేయర్లు, మున్సిపల్ చైర్మన్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.