ఎర్రగడ్డ, ఫిబ్రవరి 5: సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. ఆదివారం బోరబండ డివిజన్ బూత్ కమిటీ సమావేశం బోరబండ సైట్-3 ప్రొఫెసర్ జయశంకర్ కమ్యూనిటీహాల్లో నిర్వ హించారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ అభివృద్ధితో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నియోజకవర్గం విషయానికి వస్తే.. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్కు కంచుకోటగా అవతరించిందదన్నారు. బోరబండ ప్రజలకు తాగునీటి శాశ్వత పరిష్కారానికి గాను ఎస్పీఆర్ హిల్స్‌లో రిజర్వాయర్ నిర్మితమవుతున్నదని వివరించారు.
గత పాలకుల హయాంలో మురికివాడగా ఉన్న బోరబండ నేడు కాలనీలకు దీటుగా తయారైన వైనం మన కండ్ల ముందే ఉన్నదన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంతగా ఎదగటంలో కార్యకర్తల కృషి ఎంతో ఉన్నదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. అనంతరం డివిజన్లో ఉన్న 39 బూత్‌లకు సంబంధించి నియమితులైన ఇన్చార్జిల జాబితాలను ఎమ్మెల్యే గోపీనాథ్‌కు నేతలు అందజేశారు. కార్యక్రమంలో విజయకుమార్, డివిజన్ కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, ఫయాజ్‌ఖాన్, ఏడీ మధు, గోగుళ్ల వెంకటేష్, యూసుఫ్, ఎంఏ సత్తార్, యూసుఫుద్దీన్ పాల్గొన్నారు.
ఎర్రగడ్డ, ఫిబ్రవరి 5: బోరబండ బస్ టెర్మినల్ వద్ద దేవాదాయ శాఖకు చెందిన ప్రాంగణంలో పునర్నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠను ఆదివారం ఘనంగా నిర్వహించారు. విగ్రహంతో పాటు ధ్వజస్తంభం, ఆలయ శిఖరం ప్రతిష్ఠలు కూడా జరగటంతో తిలకించటానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో దేవాదాయ శాఖ పరిధిలోఉన్న ఆలయాల అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు.
ధ్వజస్తంభ దాతలు ఉపేంద్రచారి, స్వరూప దంపతులు, అన్నప్రసాద వితరణ దాత సురేశ్లక్ష్మి ప్రణీత్, సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని జరిపించిన గొట్టిపాటి రమణయ్య, లక్ష్మి, ఆవుగొండ శివశంకర్, మల్లేశ్వరమ్మ, డాక్టర్ రమేశ్ బింది, శ్రీనివాస్, లక్ష్మి, కృష్ణాగౌడ్, కరినోళ్ల క్రిష్ణయ్యలను కమిటీ వారు సన్మానించారు. ఆలయ చైర్మన్ లక్ష్మణ్‌గౌడ్, ధర్మకర్తలు రాములు ముదిరాజ్, దశమంతరెడ్డి, ధనలక్ష్మి, జంగయ్య, వినాయకరావునగర్ అధ్యక్షుడు ఆనంద్, పోచమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షుడు రవీందర్, ముక్కా నర్సింగ్ పాల్గొన్నారు.