మియాపూర్, ఆగస్టు 8 : పచ్చదనం లోపిస్తుండటం వల్ల వస్తున్న అనర్థాలను ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆ పరిస్థితి భవిష్యత్ తరాలకు కలగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని గౌతమినగర్‌లో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, కాలనీ వాసులతో కలసి విప్ గాంధీ ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ సంఘాలు ప్రజలను చైతన్య పరిచి విరివిగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకుంటే కాలనీలు ఆహ్లాదకరంగా పురోగతి సాధిస్తాయన్నారు. ఇండ్లలో జరిగే శుభకార్యాల సందర్భంగా విధిగా మొక్కను నాటి ఫలాన్నిచ్చే వరకూ కాపాడుకునే బాధ్యతను తీసుకోవాలన్నారు. కాలనీ అంతర్గత రహదారులు, ఖాళీ స్థలాలన్నింటిలో పూలు, పండ్లు, చల్లని నీడనిచ్చే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. మానవ జీవితానికి మొక్కలే ప్రాణాధారమని, ఈ ప్రాధాన్యాన్ని గుర్తించినపుడే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గౌరవాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, కాలనీ సంఘం ప్రతినిధులు నర్సింహరావు, కుమారస్వామి, రామకృష్ణ, ప్రసాద్, సుబ్బరాజు, వెంకటరాజు, నరేశ్, మూర్తి, రవికుమార్, పెద్ది శ్రీనివాస్, పూర్ణ, చక్రధర్, ఈశ్వర్రావు, సత్యనారాయణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.