జీడిమెట్ల, మార్చి 6: మద్యం మత్తులో దారి తప్పిన ఓ వ్యక్తి.. స్వలింగ సంపర్కుడి చేతికి చిక్కి హత్యకు గురయ్యాడు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు, ఎస్సైలు సత్తీశ్రెడ్డి, హరీశ్ కేసు వివరాలను వెల్లడించారు. బిహార్‌కు చెందిన రమేశ్‌రామ్ (50) కుటుంబం కొంత కాలంగా ఐడీఏ జీడిమెట్ల రాంరెడ్డినగర్‌లో ఉంటున్నది. రమేశ్‌రామ్ ఓ కెమికల్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 27న ఉదయం అతడు తోటి కూలీలైన బిపిన్, ప్రమోద్‌తో కలిసి షాపూర్‌నగర్‌లోని ఎస్బీఐ బ్యాంకులో ఖాతా తెరిచేందుకు వెళ్లాడు.
అనంతరం వారిద్దరితో కలిసి మద్యం తాగాడు. బిపిన్, ప్రమోద్ అక్కడి నుంచి వారి ఇండ్లకు వెళ్లిపోయారు. రమేశ్‌రామ్ మాత్రం మద్యం మత్తులో సాయంత్రం 7 గంటల వరకు సుభాష్‌నగర్‌లోనే పడుకున్నాడు. అతడిని స్థానికులు గమనించి.. అతడి వద్దనున్న ఫోన్ ద్వారా అతడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు వచ్చేలోపే అతడు నిద్రనుంచి మేల్కొని.. ఆ మత్తులోనే నడుచుకుంటూ రాత్రి 11 గంటల సమయంలో షాపూర్‌నగర్ చేరుకున్నాడు. అక్కడ రమేశ్రామ్కు మేడ్చల్‌లోని ఓ కిరణా దుకాణంలో పనిచేసే శివపూజన్ కుమార్ నిశాత్(26) కనిపించాడు. శివపూజన్ స్వలింగ సంపర్కుడు కావడంతో.. రమేశ్‌రామ్‌ను మాటల్లో పెట్టి.. హెచ్‌ఎంటీలోని నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం తాగారు.
అనంతరం శివపూజన్ తనతో స్వలింగ సంపర్కం చేయాలని కోరగా.. రమేశ్‌రామ్ నిరాకరించాడు. దీంతో శివపూజన్ కోపంతో బీరు సీసాతో రమేశ్‌రామ్ తలపై కొట్టి, దాడిచేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 28న ఉదయం మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, నిందితుడిని గుర్తించారు. అయితే, హత్య జరిగిన సమయంలో నిందితుడు శివపూజన్ ప్యాంటుకు రక్తం మరకలు అంటాయి. దీంతో అతడు రమేశ్‌రామ్ ప్యాంటును ధరించాడు. నిందితుడు శివ పూజన్ను మేడ్చల్‌లో అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.