జీడిమెట్ల, అక్టోబర్ 5: కుత్బుల్లాపూర్‌లోని ఓ ఓపెన్ నాలాలో ఓ వ్యక్తి పడి గల్లంతు కాగా.. 11 రోజుల తర్వాత జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. జీడిమెట్ల సీఐ బాలరాజు వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపాలురు గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి(52) కుటుంబం 34 సంవత్సరాల క్రితం కుత్బుల్లాపూర్‌కు వలస వచ్చింది. గణేశ్ టవర్స్‌లో నివాసముంటున్న ఆయన గాంధీ నగర్‌లోని ఎంటీఆర్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 2న న్యూ రాయల్ వైన్స్‌షాప్ వద్ద స్నేహితులు మురళీ, వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మద్యం తాగాడు. అనంతరం భారీ వర్షం పడగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నాలాలో పడిపోయాడు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఐడీపీఎల్ టౌన్షిప్ వెనుకభాగంలో ఉన్న నాలాలోని మట్టిలో కూరుకుపోయిన ఓ మృతదేహం లభించగా మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మోహన్‌రెడ్డిని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.