సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ అందాల పోటీల ప్రారంభోత్సవం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం సాయంత్రం అట్టహాసంగా జరగనున్నది. సమిస్ వరల్డ్-2025 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణకు చెందిన వివిధ రకాల జానపద, గిరిజన, శాస్త్రీయ కళలు, హైదరాబాదీ దక్కన్ కళారూపాలను ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు. మొదట తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత పేరిణి నాట్య ప్రదర్శన అత్యంత వైభవంగా జరగనున్నది. 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యరూపకం ఉంటుంది. అనంతరం కళాకారులంతా నక్షత్రం, సీతాకోకచిలుక, మిస్ వరల్డ్ లోగో ఆకృతుల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆ తర్వాత ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరీమణుల పరిచయ కార్యక్రమానికి ప్రారంభ సూచికగా..ఖండాల వారీగా తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలుంటాయి.
వాటిలో భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన కొమ్ము కోయ కళాకారులు శ్రీ రామకృష్ణ బృందం ప్రదర్శన తదితర కార్యక్రమాలు అలరించనున్నాయి. కాగా, అందాల పోటీల నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు.