సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : బ్రోచర్లలో తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను మోసం చేస్తారా? అని న్యూ హైదరాబాద్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్‌ను హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ప్రశ్నించింది. ప్లాట్ కొనుగోలుదారుడికి రూ.13.20 లక్షలు రీఫండ్‌తోపాటు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని సదరు సంస్థను కమిషన్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సీ.లక్ష్మీప్రసన్న, ఆర్.నారాయణరెడ్డితో కూడిన బెంచ్ ఆదేశించింది.
న్యూ హైదరాబాద్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ రిచ్మండ్ హిల్స్ లేఅవుట్లో ప్లాట్ నంబర్ 532 (200 గజాలు)ను సైదాబాద్‌కు చెందిన సయ్యద్ మంజూర్ హుస్సేన్ రూ.33లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో మొదట రూ.13.20 లక్షలు చెల్లించాడు. అయితే సంస్థ బ్రోచర్లో పేర్కొన్న అంశాలు, వసతులు, సదుపాయాలు.. ఫీల్డ్‌లో లేవు. దీంతో ఖంగుతిన్న కొనుగోలుదారుడు సదరు సంస్థ ప్రతినిధులను సంప్రదించగా సరైన సమాధానం రాలేదు. దీంతో హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించాడు. కేసు వివరాలను పరిశీలించిన కమిషన్ బెంచ్… బ్రోచర్లో చూపిన వసతులు కల్పించకుంటే కొనుగోలుదారుడికి రూ.13.20 లక్షలు రీఫండ్ చేయాల్సిందేనని పేర్కొన్నది. దీంతో పాటు ఫిర్యాదుదారుడిని మానసికంగా వేధింపులకు గురిచేసినందుకు రూ.50వేలు నష్టపరిహారంతోపాటు రూ.10వేలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది.