బేగంపేట్ జూలై 9: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దేవాలయాలకు తరలివచ్చి బోనాలు సమర్పించారు. అమ్మవార్లకు ఆకర్షణీయమైన బోనాలు, శివసత్తున పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో పాటు బోనాలను అమ్మవారికి సమర్పించారు. దీంతో సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా సాగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దంపతులు ఉదయం 3.30 గంటలకు మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో పాటు రాంగోపాల్‌పేట్, మోండామార్కెట్, రాణిగంజ్, రెజిమెంటల్ బజార్, సెకండ్ బజార్, బన్సీలాల్‌పేట్, శివాజీనగర్, నల్లగుట్ట, పార్కులైన్, కళాసీ గూడ తదితర ప్రాంతాల్లోని అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళల కోసం రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
రాంగోపాల్‌పేట్, మోండాలో…
రాంగోపాల్‌పేట్, మోండామార్కెట్ డివిజన్లో బోనాల జాతర ఉత్సవాలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలతో అమ్మవారి ఆలయాలకు తరలి వచ్చారు. ప్రధానంగా శివాజీనగర్ డొక్కలమ్మ, రాష్ట్ర పతి రోడ్‌లోని దండు మారెమ్మ, సేయింట్ మేరీస్ రోడ్‌లోని పీనుగుల మల్లన్న, సెకండ్ బజార్‌లోని పోచమ్మ, ముత్యాలమ్మ, కళాసీగూడలోని శ్రీదేవి పోచమ్మ, స్టేషన్ రోడ్‌లోని ఎల్లమ్మ, తదతర దేవాలయాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఫలహారపు బండ్లు,తొట్టెల ఊరేగింపు
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల్లో కీలకంగా అమ్మవారికి సమర్పించే ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ప్రతి యేడు రాత్రి పది గంటలకు ప్రారంభం అయ్యే తొట్టెల ఊరేగింపు, ఫలహారపు బండ్లు ఉత్సవాలు సాయంత్రం 4 గంటల నుంచే ప్రారం భమయ్యాయి. అమ్మవారి నైవేద్యాలు సమర్పించేందుకు నిర్వాహకులు వివిధ రకాల అలంకరణంతో తయారు చేసిన ఫలహారపు బండ్లలో అమ్మవారి దేవాలయాలకు తరలివచ్చారు. వివిధ రకాలుగా అమ్మవారిని తయారు చేసే తొట్టెలలో కూర్చోబెట్టి అమ్మను డప్పు చప్పుళ్లు, బాజా భజంత్రీలతో సికింద్రాదాబాద్లోని రహదారులలో ఊరేగిస్తూ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు ఆయా ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలకు తీసుకువచ్చారు.