హైదరాబాద్ : నగరంలోని బల్కంపేట(Balkampeta) ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం(20)న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని, అందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani)వెల్లడించారు. సోమవారం అమ్మవారి కల్యాణం ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం(Kalyanam) రోజున అమ్మవారిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసమని తెలిపారు. ఆలయానికి వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులుఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు ,అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బల్కంపేట ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఆలయానికి రూ.4కోట్ల ఆదాయం రాగా నేడు రూ. 22 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. యాదాద్రి (Yadadri)లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని , వేములవాడ, బాసర, భద్రాద్రి ఆలయాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.