అమీర్‌పేట్, సెప్టెంబర్ 29: సనత్‌నగర్ నెహ్రూ పార్కులో ప్రతిపాదిత థీమ్ పార్కు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం సనత్‌నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ విభాగాల అధికారులతో కలిసి డివిజన్లోని నెహ్రూపార్కు, సుభాష్‌నగర్ బస్తీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా థీమ్ పార్కు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తన పర్యటనలో భాగంగా స్థానికులతో మాట్లాడారు. పార్కు పరిసరాల్లో రాత్రి వేళల్లో అసాంఘిక శక్తులు, వేళాడుతున్న విద్యుత్ తీగలు, చెత్త తరలింపు రిక్షాలు రోజూ రాకపోవడం వంటి సమస్యలను స్థానికులు మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు తన కోటా నుంచి రూ.5 లక్షలను పవర్‌బోర్ నిర్మాణానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దశాబ్దాలుగా కొనసాగిన సుభాష్‌నగర్ హైటెన్షన్ విద్యుత్ తీగల సమస్యను తాను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పరిష్కరించానని చెప్పారు. అదేవిధంగా బస్తీలో అన్ని వసతులతో కమ్యూనిటీ హాల్, దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని డ్రైనేజీ సమస్యతో పాటు, వరదనీటి కాల్వల నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాల వంటివి స్థానికుల చొరవతో టీఆర్ఎస్ హయాంలో జరుగుతున్నవేని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సనత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు.
బీసీల సంక్షేమానికి టీఆర్ఎస్ పెద్దపీట వేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అమీర్‌పేట్ డివిజన్ టీఆర్ఎస్ బీసీసెల్ అధ్యక్షుడిగా నియమితులైన కూతురు నర్సింహ బుధవారం ఉదయం అమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరావు, మణి సంతోష్‌కుమార్‌లతో కలిసి మంత్రి తలసానిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కూతరు నర్సింహను మంత్రి అభినందిస్తూ శాలువాతో సత్కరించారు.