
మన్సూరాబాద్, అక్టోబర్ 1: మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఫొటో, వీడియోగ్రాఫర్ల పాత్ర అనిర్వచనీయమని ఆబ్కారీ, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం, ఫొటోటెక్ సంయుక్తాధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ కేబీఆర్ కన్వెన్షన్హాల్లో మూడురోజులపాటు జరిగే దక్షిణ భారత ఫొటో ట్రేడ్ ఎక్స్పోను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఫొటో,వీడియోగ్రాఫర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీఇచ్చారు.
ఫొటో,వీడియోగ్రాఫర్లలో చాలామంది నిరుపేదలు ఉన్నారని.. తన జిల్లాలో ఫొటోగ్రాఫర్లకు ఇంటివసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఫొటో,వీడియోగ్రాఫర్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని, ఇటీవల తన బంధువు ఇంట్లో వేడుక కోసం రూ.23 లక్షల కొటేషన్ ఇచ్చారని తెలిపారు. పేద ఫొటో, వీడియోగ్రాఫర్లను ఆదుకునేందుకు సంక్షేమ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
అంతకుముందు జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ ఫొటోగ్రాఫర్లు సెంథిల్‌కుమార్, చోటాకే నాయుడు, ఎంవీ రఘు మాట్లాడుతూ సాంకేతిక మార్పులకనుగుణంగా నూతన ఉత్పత్తులపై ఫొటోగ్రాఫర్లు తెలుసుకునేందుకు ఎక్స్పో దోహదపడుతుందని చెప్పారు. ఎక్స్పో ద్వారా సమకూరే ఆదాయాన్ని ఫొటోగ్రాఫర్లతోపాటు వారి కుటుంబాల సంక్షేమానికి ఉపయోగిస్తామని చెప్పడం అభినందనీయమన్నారు.
కాగా ఈ ఎక్స్‌పోలో సుమారు 200 స్టాళ్లను ప్రముఖ కంపెనీలు ఏర్పాటు చేయగా, దక్షిణ భారతదేశంతోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పెద్దఎత్తున ఫొటోగ్రాఫర్లు తరలివచ్చారు. ఆదివారం వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. కార్యక్రమంలో మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే హుస్సేన్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, కోశాధికారి శైలేంద్ర, ఉపాధ్యక్షుడు జగదీష్, సంయుక్త కార్యదర్శి జంగారెడ్డి, ఫొటోటెక్ చీఫ్ ఎడిటర్ అభిమన్యురెడ్డి, జూలురు మధు, కాశీరత్నం, గౌతం, శరత్సాగర్, గ్రేటర్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధానకార్యదర్శి సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.