Hyderabad | ‘గతంలో 14 రోజులకొకసారి నీటి సరఫరా జరిగేది. ప్రస్తుతం రోజు విడిచి రోజూ తాగునీటిని అందిస్తున్నాం. వచ్చే టర్మ్‌లో ప్రతి రోజూ ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తాం.. ఎప్పుడు ట్యాప్ తిప్పినా 24 గంటలు తాగునీరు వచ్చేలా చేస్తాం.. ఇది మా కమిట్మెంట్.. కచ్చితంగా చేసి చూపిస్తాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ (టీబీఎఫ్) సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఓఆర్ఆర్కు ఆర్ఆర్ఆర్కు మధ్య కొత్త హైదరాబాద్ ఆవిష్కృతం అవుతుందని, ప్లాన్డ్ హైదరాబాద్‌లో భాగంగా బెంగళూరుకు మించి హైదరాబాద్‌కు సోషల్ ఇన్ఫ్రా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. చైనాలో బీజింగ్ నగరానికి ఐదు రింగ్ రోడ్లు ఉన్నాయని, ఆర్ఆర్ఆర్ వస్తే మనకు మూడు రింగు రోడ్లు ఉంటాయన్నారు. ఆర్ఆర్ఆర్ అవతల మరో రింగు రోడ్డు రావడం ద్వారా రాష్ట్రం నలమూలల నుంచి హైదరాబాద్‌కి రాకపోకలు మరింత ఈజీగా ఉంటుందన్నారు. నిర్మాణ రంగ అనుమతుల్లో సింగిల్ విండో అమలు చేసి ఎన్వోసి లాంటి సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రగతి, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు టీబీఎఫ్ ప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ అభివృద్ధిపై ఇప్పటి వరకు చూసింది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. త్వరలో 300 కిలోమీటర్ల రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) రాబోతున్నదని, ఓఆర్ఆర్కు ఆర్ఆర్ఆర్కు మధ్య కొత్త హైదరాబాద్ ఆవిష్కృతం అవుతుందని కేటీఆర్ చెప్పారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ (టీబీఎఫ్) సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. చైనాలోని బ్రీజింగ్ నగరానికి ఐదు రింగ్ రోడ్లు ఉన్నాయని, ఆర్ఆర్ఆర్ వస్తే మనకు మూడు రింగు రోడ్లు ఉంటాయన్నారు.
ఆర్ఆర్ఆర్ అవతల మరో రింగు రోడ్డు రావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు మరింత ఈజీగా ఉంటుందన్నారు. గతంలో 14 రోజులకు ఒకసారి నీటి సరఫరా జరిగేదని, ప్రస్తుతం రోజు విడిచి రోజు తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. వచ్చే టర్మ్‌లో ప్రతి రోజు ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తామని, ఎప్పుడు ట్యాప్ తిప్పినా 24 గంటలు తాగునీరు సరఫరా చేస్తామని కేటీఆర్ చెప్పారు. ఇది తమ కమిట్మెంట్ అని, తప్పకుండా చేస్తామన్నారు. ప్లాన్డ్ హైదరాబాద్‌లో భాగంగా బెంగళూరుకు మించి హైదరాబాద్‌కు సోషల్ ఇన్ఫ్రా పెంచాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు.
నిర్మాణ రంగ అనుమతుల్లో భాగంగా డిసెంబర్ 3 తర్వాత సింగిల్ విండో అమలు చేసి.. ఎన్వోసీ లాంటి సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాలా, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సవరిస్తామని చెప్పారు. బోడుప్పల్లో వక్ఫ్ స్థలాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్, తెలంగాణ గొప్పతనం ఇక్కడున్న వారికి అర్థం కాదన్నారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు, టీఎస్ బీ పాస్ లాంటి విధానాలను చూసి మహారాష్ట్ర బిల్డర్స్ ఆశ్చర్యపోయారని తెలిపారు. మన బిల్డర్లు కూడా ఇతర రాష్ర్టాలలో పర్యటించి వస్తే కానీ మన అభివృద్ధి కనబడదని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతను నిర్వర్తించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పోలింగ్ రోజును హాలిడేగా చూడకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. బిల్డర్లు వచ్చే 15 రోజుల పాటు తమ వినియోగదారులు, ఇన్వెస్టర్లతో కలిసి ఓటు హక్కుపై చైతన్యం కల్పించాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరంలో కులం పేరుతో కుంపట్లు ..మతం పేరుతో మంటలు లేకుండా.. అభివృద్ధి మా కులం, సంక్షేమమే మా మతం.. అంటూ ముందుకు పోతున్నామని కేటీఆర్ అన్నారు. ఈ ప్రగతి, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కేటీఆర్ అన్నారు.
జంట నగరాల నుంచి వందలాది మంది బిల్డర్లు ఈ సమావేశంలో పాల్గొనగా.. రియల్ ఎస్టేట్ వృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, విప్లవాత్మకమైన నిర్ణయాలే కారణమని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో రియల్ ఎస్టేట్ పడిపోతుందని ఎన్నో అనుమానాలు, అపోహలు సృష్టించారని, సీఎం కేసీఆర్ ఆదిలోనే రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి కీలక జీవోలు ఇచ్చి రియల్ ఎస్టేట్‌ను అగ్రగామిగా నిలిపారన్నారు. ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లోనే రియల్ ఎస్టేట్ మంచి డిమాండ్ ఉన్నదని, ముఖ్యంగా నిర్మాణ రంగ అనుమతుల విషయంలో పారదర్శకంగా, నిర్ణీత సమయంలో పర్మిషన్లు వస్తున్నాయని టీబీఎఫ్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన నిలబడిన అభ్యర్థులను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా టీబీఎఫ్ ప్రతినిధులు మద్దతును ప్రకటించారు.