పీసీబీని గాలికొదిలేసింది
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లవుతున్నా ఇప్పటిదాకా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలు, వాటి వల్ల ప్రజల ఇబ్బందులపై సీఎం రేవంత్‌రెడ్డి సహా ఉన్నతాధికారులెవరూ దృష్టి సారించడం లేదు.
- ఏడాదిగా బోర్డు మీటింగ్ నిర్వహించని చైర్మన్
- పరిశ్రమల్లో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి
- గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న ఫైళ్లు
- పరిశ్రమలను తనిఖీ చేయని మంత్రి కొండా సురేఖ
- మొద్దునిద్రలో నియంత్రణ బోర్డు అధికారులు
సిటీ బ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లవుతున్నా ఇప్పటిదాకా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలు, వాటి వల్ల ప్రజల ఇబ్బందులపై సీఎం రేవంత్‌రెడ్డి సహా ఉన్నతాధికారులెవరూ దృష్టి సారించడం లేదు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కాలుష్య నియంత్రణ మండలికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్ని శాఖలతో దీనికి సంబంధం ఉంటుంది. ముఖ్యంగా నగరంలోని ప్రతిది పీసీబీతో ముడిపడి ఉంటుంది.
కర్మాగారాల నుంచి దవాఖానల దాకా అన్ని రంగాలు పీసీబీతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ప్రజల ఆరోగ్యం, నేల, గాలి, నీరు సహా పంచభూతాలు ఈ బోర్డుతో అనుసంధానమై ఉంటాయి. అలాంటి కాలుష్య నియంత్రణ మండలిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ముఖ్యంగా బోర్డు చైర్మన్‌గా వ్యవహరించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా బోర్డు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని తెలుస్తున్నది. మరోవైపు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తనకున్న విశిష్ట అధికారాలతో ఏనాడూ రాష్ట్రంలోని ఒక్క పరిశ్రమను కూడా తనిఖీ చేయలేదు. పర్యావరణ పరిరక్షణపై రెండేండ్లలో ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదు.
చైర్మన్ ఉన్నట్టా? లేనట్టా?
పీసీబీకి చైర్మన్, మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారులు ఉంటారు. మెంబర్ సెక్రటరీ పూర్తి వ్యవహారాలను నిర్వర్తిస్తారు. వీటిని చైర్మన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రతి మూడు నెలలకోసారి బోర్డు మీటింగులు నిర్వహిస్తారు. అధికారుల పనితీరు, పాలనా పరమైన నిర్ణయాల్లో లోటుపాట్లపై దిశా నిర్దేశం చేస్తారు. పాలనా పరమైన నిర్ణయాలు, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైళ్లను పరిశీలించి అనుమతులిస్తారు. చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి సీఎస్ శాంతి కుమారి మాత్రం ఎప్పటికప్పుడు బోర్డు మీటింగులు నిర్వహిస్తూ పరిశ్రమల అనుమతులు, కాలుష్య కారకాలను వెదజల్లే వాటిపై చర్యలకు.
సంబంధించిన అన్ని పనులను చక్కబెట్టేవారు. ఎప్పటి ఫైళ్లను అప్పడే క్లియర్ చేస్తూ అధికారులపై అదనపు భారం పడకుండా చూసుకునేవారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పీసీబీ చైర్మన్‌గా రామకృష్ణారావు ఈ ఏడాది మే నెలలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన కాలుష్య నియంత్రణ మండలిని కనీసం సందర్శించ లేదు. బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు దాటినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బోర్డు మీటింగ్ నిర్వహించలేదని తెలుస్తున్నది. అసలు పీసీబీకి చైర్మన్ ఉన్నారా? లేరా? అని పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య కోరల నుంచి ప్రజలను సంరక్షించే ప్రభుత్వ అధికారులు మొద్దునిద్ర వీడాలని కోరుతున్నారు.
మంత్రి.. పర్యావరణ పరిరక్షణ మరిచారా?
కేబినెట్లో పర్యావరణ శాఖ మంత్రి పాత్ర అత్యంత కీలకం. పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే కాలుష్యాలను విడుదల చేస్తున్న పరిశ్రమలను మంత్రి తనిఖీ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని పరిశ్రమలు, యజమానులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొండా సురేఖ తన బాధ్యతను మరిచినట్లున్నారని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండేండ్లయినా ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమను కూడా ఆమె సందర్శించలేదని తెలుస్తున్నది.
పర్యావరణ పరిరక్షణకు ప్రజలు, పరిశ్రమల యజమానుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలేవి చేపట్టలేదు. రాష్ట్రంలో వందలాది పరిశ్రమలు ప్రజలకు హాని కలిగించే రసాయనాలను వెదజల్లుతున్నాయి. వాటి వల్ల లక్షలాది మంది ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా వ్యవహరిస్తే ఎలా? అంటూ నిలదీస్తున్నారు. అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో పరిశ్రమల యజమానులు ఇష్టారీతిన కాలుష్యాలను విడుదల చేస్తూ జనజీవనానికి హాని కలిగిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

