సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మారికి ముందు నగరంలో మెట్రో రైళ్లు ఐటీ ఉద్యోగులతో సందడిగా ఉండేవి. లాక్‌డౌన్‌తో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేయడంతో 90శాతం మంది ఐటీ ఉద్యోగులు ఇండ్ల నుంచే ఉద్యోగాలు చేశారు. అయితే ఏప్రిల్ మొదటి వారం నుంచి ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం రద్దుచేసి ఆఫీసులకు రావాలని తెలుపడంతో ఇప్పుడు ఐటీ ఉద్యోగులంతా ఆఫీసుల బాట పట్టారు. దీంతో ఆఫీసులకు వచ్చే ఐటీ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు ఐటీ కారిడార్‌కు వచ్చిపోయే రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్లను నడిపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల మెట్రో రైళ్ల వేగాన్ని పెంచడంతో ప్రయాణ సమయం ఎంతో కలిసిరానున్నది.
ప్రస్తుతం మూడు కారిడార్లలో పూర్తి స్థాయిలో మెట్రో రైళ్లను నడుపుతున్నారు. కారిడార్-1 (మియాపూర్-ఎల్బీనగర్)లో 325 ట్రిప్పులు, కారిడార్-3 (నాగోల్- రాయదుర్గం)లో 325 ట్రిప్పులు, కారిడార్-2 (జేబీఎస్-ఎంజీబీఎస్)లో 265 ట్రిప్పులు నడుపుతున్నారు. ప్రతి రోజు మూడు కారిడార్లలో కలిపి మొత్తం 915ట్రిప్పులు నడుపుతుండగా, ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 2లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రద్దీ సమయాల్లో(ఫీక్స్ అవర్స్) 5 నుంచి 8 నిమిషాలకు ఒక మెట్రో రైలును, రద్దీ తక్కువగా ఉన్న సమయంలో 10 నిమిషాలకు ఒక మెట్రో రైలు అన్ని కారిడార్లలో అందుబాటులో ఉంటుంది.
మెట్రో మూడు కారిడార్లలో ఎంతో ప్రత్యేకమైంది కారిడార్-3. నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఉన్న ఈ మార్గం కారిడార్-2ను జేబీఎస్, పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద, కారిడార్-1ను అమీర్‌పేట ఇంటర్చేంజ్ స్టేషన్ వద్ద కలుస్తూ ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, రాయదుర్గం వరకు వెళ్తుంది. ఎల్బీనగర్, నాగోల్, మియాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, మలక్‌పేట ఇలా కీలకమైన ప్రాంతాల నుంచి మెట్రో రైళ్ల ద్వారా ఐటీ ఉద్యోగులు మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు రాకపోకలు సాగిస్తుంటారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐటీ కారిడార్‌లో అమీర్‌పేట ఇంటర్చేంజ్ స్టేషన్ నుంచి రాయదుర్గం వరకు షార్ట్ లూప్ విధానంలో మెట్రో రైళ్లను నడుపుతామని మెట్రో అధికారులు తెలిపారు.