పనాజీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్(CJI Surya Kant) మధ్యవర్తిత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని కేసుల్లో ఇరు వర్గాలు మధ్యవర్తిత్వాన్ని ఆమోదిస్తున్నాయని, ఆ ప్రక్రియ విజయవంతం అవుతున్నదని, చాలా తక్కువ ఖర్చుతో ఆ సమస్య ముగిసిపోతున్నదని సూర్యకాంత్ అన్నారు. కేసులను పరిష్కరించే ప్రక్రియలో మధ్యవర్తిత్వ విధానం కీలకంగా మారిందన్నారు. మధ్యవర్తిత్వ అవగాహన అంశంపై గోవాలోని కళా అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ సంస్థ ఆ కాన్పరెన్స్ను ఆర్గనైజ్ చేసింది.
మధ్యవర్తిత్వాన్ని విజయవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా పార్టీలు ఆమోదిస్తున్నాయని, ఏదైనా కేసు పరిష్కారంలో ఇది రెండు వైపులా విన్-విన్ పరిస్థితిగా ఉంటుందన్నారు. మధ్యవర్తిత్వ విధానంలో ఎవరిపైనా మధ్యవర్తి నుంచి ఎటువంటి వత్తిళ్లు చేయబోరన్నారు. మీడియేషన్ ఫర్ నేషన్ అన్న కార్యక్రమాన్ని ఆవిష్కరించినట్లు సీజేఐ కాంత్ తెలిపారు. ఒకవేళ ప్రజల్లో అవగాహన పెరిగితే, అప్పుడు మధ్యవర్తిత్వాన్ని ఓ విజయవంతమైన పరికరంగా భావిస్తారని అన్నారు. దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయని, ఈ ప్రక్రియ విజయవంతమైందన్నారు.
ఈ విషయంలో హైకోర్టులు, జిల్లా కోర్టులను జాగృతం చేశామన్నారు. మధ్యవర్తిత్వం అనేది నిరంతర ప్రక్రియ అని, పాత కేసుల్లోనూ, కొత్త కేసుల్లోనూ ఈ విధానం చెల్లుతుందని, కోర్టులోకి కేసు రాక ముందు కూడా మధ్యవర్తిత్వాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు.