సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): జలమండలిలో పునః ప్రారంభించిన ‘డయల్ యువర్ ఎండీ’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ సుదర్శన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. వినియోగదారుల నుంచి నేరుగా ఫోన్ కాల్స్‌ను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎండీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలను తక్షణమే సంబంధిత డీజీఎంలు, మేనేజర్లు సందర్శించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ అవతల, ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల నుంచి కొత్త కనెక్షన్ల కోసం ఫోన్లు చేశారు.
ఈ పరిధిలో ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు పూర్తి కాగా, డిస్ట్రిబ్యూషన్ లైన్ల నిర్మాణం పూర్తయిన వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని గంటన్నర పాటు నిర్వహించారు. మొత్తం 36 మంది వినియోగదారులు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించారని అధికారులు తెలిపారు. ఉప్పల్, దిల్సుఖ్నగర్, నాగోల్, షేక్‌పేట, ఓల్డ్ సిటీ, గౌలిపుర, బాలానగర్, నాంపల్లి ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి సమస్యలను వివరించారు. ఎక్కువగా తాగునీటి సరఫరా, కలుషిత నీరు, లో ప్రెషర్, సీవరేజీ ఓవర్ ఫ్లో, పైపులైన్ల నుంచి లీకేజీలు, డ్రైనేజీ వంటి సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో ఈడీ ఎం.సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీ.ఎల్. ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.