సైదాబాద్, ఆగస్టు 11 : సాహెబ్‌నగర్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యురాలు అంజనా పర్వర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బుధవారం సాయంత్రం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని చింతల్‌బస్తీలోని అంతయ్య, శివ కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. దుర్ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యురాలు అంజనా పర్వర్ మాట్లాడుతూ డ్రైనేజీ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించటం బాధాకరమని, ఇటువంటి సంఘటనలు జరగటం మానవీయ తప్పిదంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాద బాధితులకు పది లక్షల రూపాయలు మాత్రమే సరిపోవన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలను అందిస్తామని, వారికి న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ సాహెబ్‌నగర్ దుర్ఘటనకు బాధ్యులైన అధికారులపై, గుత్తేదారుడిపై చర్యలు తీసుకున్నామని,బాధిత కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించామని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు కోరిన విధంగా వారం రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామని, ఉద్యోగం కల్పించే విషయంపై చర్చిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.