ఎల్బీనగర్, సెప్టెంబర్ 3: పర్యావరణ హితంతో మట్టి గణనాథులను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ పీ అండ్‌టీ కాలనీ న్యూ గడ్డిఅన్నారం శ్రీ గణేశ్ యువ భక్త మండలి ఆధ్వర్యంలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం 36వ సంవత్సరం అయినందున 36 అడుగుల పర్యావరణ హిత మట్టి గణనాథునిడిని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ వినాయక విగ్రహ బ్రోచర్‌ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ భారీగా మట్టి గణనాధుడిని ఏర్పాటు చేస్తూ శ్రీ గణేశ్ యువ భక్త మండలి వారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను అందరూ శాంతియుతంగా ఘనంగా జరుపుకోవాలని సూచించారు. శ్రీ గణేశ్ యువ భక్త మండలి ప్రతినిధి శేఖర్ యాదవ్ మాట్లాడుతూ తాము తొలిసారిగా 1988లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఈ ఏడాది 36 అడుగుల మట్టి గణనాధుడిని ప్రతిష్ఠిస్తున్నామని అన్నారు.