చిక్కడపల్లి, ఆగస్టు 15: విశ్వనగరంలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ఏమాత్రం బెరుకు లేకుండా పట్టపగలే వరుస చోరీలకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న ఇండ్ల నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడుతూ.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రోజుకో చోట దొంగతనం జరుగుతున్నది. ఖజానా జ్యువెల్లరీ, కేబీహెచ్‌బీ కాలనీల్లో జరిగిన చోరీలను మరువకముందే తాజాగా శుక్రవారం చిక్కడపల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దోపిడీ దొంగలు ఏకంగా 36 తులాల బంగారాన్ని అపహరించారు. ఇలా వరుస చోరీ ఘటనలు పోలీసుల నిఘా వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రోజుకో చోట దొంగతనం జరుగుతున్నా.. పోలీసు యంత్రాంగం ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఏకంగా పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే దొంగతనం జరగడం నగర ప్రజలను నివ్వెరపోయేలా చేసింది.
తెల్లవారుజామున 2 గంటలకు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లిలోని వివేక్‌నగర్ దిట్టకవి ఎన్క్లేవ్ ఎన్‌క్లేవ్‌లో లక్ష్మీ నారాయణ దంపతులు నివాసముంటున్నారు. ఇంట్లో తలుపులకు చెదలు రావడంతో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి మరమ్మతు పనులు గత వారం నుంచి చేయిస్తున్నారు. బీహార్‌కు చెందిన కార్మికులు ఈ పనులు చేస్తున్నారు. తెల్లవారితే శ్రావణ శుక్రవారం కావడంతో పూజ చేసేందుకు గురువారం రాత్రి లక్ష్మీనారాయణ భార్య బీరువాలోని 36 తులాల బంగారు ఆభరణాలను సిద్ధం చేసుకుని ఉంచారు. ఈక్రమంలో బీరువాకు తాళం వేయడం మరిచారు. తలుపు కూడా సరిగ్గా పెట్టలేదు. ఇదే అదనుగా భావించిన దొంగలు.. తెల్లవారుజామున 2 గంటలకు ఇంట్లోకి ప్రవేశించారు. లక్ష్మీనారాయణ దంపతులు గాఢ నిద్రలో ఉండగా, బీరువాలోని 36 తులాల బంగారం, 35 వేల నగదును అపహరించారు. వారు ఉదయం లేచి బీరువా తెరిచి చూడగా, నగలు, నగదు మాయమయ్యా యి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌కుమార్, ఇన్స్పెక్టర్ రాజునాయక్, డీఐ శంకర్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించారు. చోరీకి గురైన భవనం చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. మరమ్మతు పనులకు వచ్చిన బీహార్‌కు చెందిన కార్మికల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు సోలాపూర్‌కు చెందిని పాతనే రస్తు డిగా గుర్తించినట్లు సమాచారం.