మన్సూరాబాద్, ఆగస్టు 19: హైదరాబాద్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు చేస్తున్న దొంగ, మోసపూరిత వ్యాపారాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైశ్య వికాస్ వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. ‘తెలంగాణలో గుజరాత్, రాజస్థాన్ మార్వాడీ హఠావో… తెలంగాణ వ్యాపారి బచావో’ పేరుతో ఎల్బీనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు వరకు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
వైశ్య కమ్యూనిటీ సభ్యులతో పాటు విశ్వకర్మ, తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ, యాదవ కులాల హక్కుల పోరాట సమితి సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాచం మాట్లాడుతూ.. దొంగ, మోసపూరిత వ్యాపారం చేస్తూ తెలంగాణలోని వ్యాపారుల పొట్ట కొడుతూ మార్వాడీల వ్యాపారాలను అరికట్టే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. మార్వాడీల కారణంగా కిరాణ వృత్తిపై ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్న వైశ్యులు రోడ్డున పడిపోయారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ మార్వాడీలకు వత్తాసు పలకడం సమంజసం కాదన్నారు. మార్వాడీ హఠావో ఉద్యమాన్ని భవిష్యత్తులో మరింతగా విస్తృత పరుస్తామని తెలిపారు. నాయకులు పాండురంగా చారి, సల్వాచారి, శ్యాంసుందర్‌గౌడ్, ఉపేంద్రయాదవ్, కూర రమేష్‌గుప్తా, నంగునూరి రమేష్, నిఖిల్, కొత్త రవికుమార్ గుప్తా, శ్రవణ్‌కుమార్ గుప్తా, శ్రీధర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.