హిమాయత్‌నగర్, ఫిబ్రవరి 12: సమాజంలో తల్లి పాత్ర ఎంతో గొప్పదని పలువురు వక్తలు అన్నారు. ముట్టూరి కమలమ్మ ఫౌండేషన్,సాహితీ కిరణం సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల చిన్న కథల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి హిమాయత్‌నగర్‌లోని శ్రీముఖీ కాంప్లెక్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్, నేటి నిజం దినపత్రిక సంపాదకుడు బైస దేవదాస్, వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంశీ రామరాజు, సాహితీకిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు, గాయనీ ఆర్.దమయంతి మాట్లాడుతూ సమాజంలోని కొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా విలువలు పెంపొందించి బాధ్యతాయుతంగా పిల్లలను తీర్చిదిద్దడంలో అమ్మే కీలకమన్నారు. అలాంటి అమ్మలను వృద్ధాప్యంలో ఆప్యాయంగా కన్న బిడ్డలు చూసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు దోహదపడతాయని తెలిపారు. గాయనీ, గాయకులు ఆలపించిన పాటలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో శ్రీ స్వర్ణ భారతి అధ్యక్షురాలు ఆమంత, కథా రచయిత్రి పొత్తూరి జయలక్ష్మి, ప్రతినిధులు పి.వెంకట దాసు, శారద, వి.ఆర్.కె.ఫణి, తనికెళ్ల రామకృష్ణ పాల్గొన్నారు.