హైదరాబాద్: హైదరాబాద్‌లో కేఫ్ నీలోఫర్ అంటే తెలియని వాళ్లుండరు. కేఫ్ నీలోఫర్‌లో తయారయ్యే చాయ్ హైదరాబాదీ చాయ్‌గా ప్రత్యేకించి నీలోఫర్ చాయ్‌గా ప్రసిద్ధి గాంచింది. ఈ కేఫ్ నీలోఫర్ చాయ్ అద్వితీయమైన రుచిని ఆస్వాదించని హైదరాబాదీలు చాలా అరుదుగా ఉంటారు. అత్యుత్తమ సేవలు, ఉత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గత నాలుగు దశాబ్దాలుగా చాయ్ మార్కెట్లో కేఫ్ నీలోఫర్ రారాజుగా వెలుగొందుతున్నది.
నాలుగు దశాబ్దాలుగా చాయ్, బిస్కెట్లతో ప్రసిద్ధిచెందిన కేఫ్ నీలోఫర్ ‘ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఈ మధ్య కార్పోరేట్ గుర్తింపు కూడా పొందింది. బేకరీ, చాయ్ మార్కెట్లో ప్రత్యేకతను చాటుకోవడమే లక్ష్యంగా కేఫ్ నీలోఫర్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావు పేరు మీదుగా ‘ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అని పేరు పెట్టారు.
అయితే, కేఫ్ నీలోఫర్ చైర్మన్ బాబూరావు.. ప్రైవేట్ ఆక్షన్ పోర్టల్ ‘టీ ఇన్‌టెక్’ శుక్రవారం నిర్వహించిన వేలంలో అత్యున్నత నాణ్యమైన టీ గార్డెన్‌లోని ‘మనోహరి గోల్డ్ టీ’కి బిడ్డింగ్ వేశారు. ఒక కేజీకి రూ.1,15,000 లెక్కన వేలంలో మనోహరి గోల్డ్ టీని కొనుగోలు చేశారు. ఇంతటి భారీ ధర పెట్టడంతో టీ ఇండస్ట్రీలో గతంలో నమోదైన రికార్డులన్నీ బద్దలయ్యాయి.
అస్సాంలోని దిబ్రుగఢ్‌లో సాగయ్యే ఈ మనోహరి గోల్డ్ టీ రకం అత్యంత అరుదైనది, ప్రఖ్యాతిగాంచినది. గత నాలుగు సంవత్సరాలుగా వేలంలో అత్యధిక ధర పలుకుతున్న టీ ఉత్పత్తిగా ఇది గుర్తింపు పొందింది. యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియెంట్స్ పుష్కలంగా కలిగిన ఈ మనోహరి గోల్డ్ టీతో శక్తిమంతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఈ మనోహరి గోల్డ్ టీ పొడిని ఉపయోగించి తయారు చేసే చాయ్ 2023, జనవరి 1 నుంచి బంజారాహిల్స్‌లోని కేఫ్ నీలోఫర్ ప్రీమియమ్ లాంజ్‌లో, హిమాయత్‌నగర్‌లోని కేఫ్ నీలోఫర్‌లో అందుబాటులోకి రానుంది.