అమీర్‌పేట్, డిసెంబర్ 17 : పెంపుడు జంతువుల ఔత్సాహికులకు ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ‘మ్యాన్కైండ్స్ పెట్స్టార్ వెట్ కార్నివాల్’ జరుగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ కనైన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చీకోటి ప్రవీణ్, విశాల్ సుధామ్ ఆదివారం బేగంపేట్‌లోని ఫంక్షన్ ప్యాలెస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కార్నివాల్ కేవలం వినోదాన్ని పంచేందుకు మాత్రమే కాదని, బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల నిర్వహణ పట్ల జంతు ప్రేమికుల్లో అవగాహన పెంచుతుందన్నారు. కుక్క, పిల్లి, పక్షి, చేపలు, గుర్రం, ఎద్దు, దున్నపోతు, ఒంటె డ్యాన్స్, అన్యదేశ జంతు ప్రదర్శనలు ఈ కార్నివాల్లో హైలెట్‌గా నిలిచే సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దీంతో పాటు జంతువులకు కాస్ట్యూమ్ పోటీకి, చురుకుదనం, విధేయత ప్రదర్శనలు, పెట్ అడాప్షన్ డ్రైవ్, పెట్ ఉత్పత్తులు మరియు సేవలతో విక్రేత స్టాల్స్, పెంపుడు జంతువుల ఆరోగ్యంపై విద్యా సెషన్లు ఉంటాయని, మరిన్ని వివరాలకు telanganacanineassociation<@>gmail.com వెబ్సైట్లో స్రంపదించాలని వారు కోరారు.