మన్సూరాబాద్, నవంబర్ 27: బైక్పై నుంచి కింద పడిపోయిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నాగోల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మక్బూల్ జానీ కథనం ప్రకారం.. నాగోల్, లలితానగర్ కాలనీకి చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (39) వృత్తిరీత్యా కొత్తపేటలోని హ్యాత్వే ఫైబర్ కార్యాలయంలో పని చేస్తుంటాడు.
ఉద్యోగ నిమిత్తం బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ రెడ్డి రాత్రి 9 గంటలకు ఇంటికి తన బైక్పై తిరిగి వస్తుండగా, నాగోల్లోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే ముందు బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో రాజశేఖర్ రెడ్డి నడుపుతున్న బైక్ అదుపు తప్పడంతో కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికంగా ఉన్న నాగోల్లోని సుప్రజ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య బైరెడ్డి మధుమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు.