HomeHyderabadMalkajigiri Congress Leaders Resigned En Masse
కాలుమోపిన మైనంపల్లి.. ఖతమైన కాంగ్రెస్
మల్కాజిగిరి కాంగ్రెస్‌కు మైనంపల్లి సెగ బాగానే తగిలింది. ఆ పార్టీ కండువా కప్పుకొని ఆయన హైదరాబాద్‌లో కాలు మోపింది మొదలు.. ఏ ఒక్కరూ కాంగ్రెస్‌లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. హన్మంతరావు ఢిల్లీ నుంచి నగరానికి చేరుకున్న రోజే సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
మూకుమ్మడి రాజీనామాలతో మల్కాజిగిరి కాంగ్రెస్ ఖాళీ
నందికంటి బాటలోనే పార్టీని వీడిన నియోజకవర్గ, డివిజన్ నాయకులు
బీసీ నేత శ్రీధర్‌ను వంచించారంటూ పెల్లుబికిన నిరసన
అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే కాంగ్రెస్ ఖాళీ అవుతున్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో అసలే అంతంత మాత్రమే ఉన్న హస్తం పార్టీ పరిస్థితి ప్యారాచూట్ నేతలతో మరింత కుదేలవుతున్నది. ముఖ్యంగా మైనంపల్లి హన్మంతరావు రాకతో ఇప్పటికే మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా.. అందుకు కొనసాగింపుగా మంగళవారం పెద్ద ఎత్తున మల్కాజిగిరి కాంగ్రెస్ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరగదని తేలిపోయిందని మండిపడ్డారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి వెంట ఒకరిద్దరు మాత్రమే వెళ్లగా.. చేరిన కాంగ్రెస్‌లో క్యాడర్ ఖాళీ కావడంతో ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందనే అంతర్మథనంలో అనుచరులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి
మల్కాజిగిరి కాంగ్రెస్‌కు మైనంపల్లి సెగ బాగానే తగిలింది. ఆ పార్టీ కండువా కప్పుకొని ఆయన హైదరాబాద్‌లో కాలు మోపింది మొదలు.. ఏ ఒక్కరూ కాంగ్రెస్‌లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. హన్మంతరావు ఢిల్లీ నుంచి నగరానికి చేరుకున్న రోజే సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. డీసీసీ అధ్యక్షుడు, కీలకమైన బీసీ నేత నందికంటి శ్రీధర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తమ నిర్ణయాన్ని మంగళవారం ప్రకటిస్తామని చెప్పిన నియోజకవర్గంలోని కీలక కాంగ్రెస్ నేతలు ఊహించినట్లుగా హస్తం పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి తాము మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. మల్కాజిగిరి కాంగ్రెస్ ఇక పరిస్థితి దారుణంగా మారింది.
కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం
మల్కాజిగిరి చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో నాయకులు సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ డివిజన్ అధ్యక్షుడు, మైనారిటీ సెల్ కన్వీనర్, మీడియా సెల్ కన్వీనర్, కార్యదర్శులు సంయుక్తంగా మాట్లాడారు. పార్టీ కోసం 30 సంవత్సరాలుగా సేవలందించిన నందికంటి శ్రీధర్ బీసీ వర్గానికి చెందిన నాయకుడని అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీధర్ సేవలందించారని గుర్తు చేశారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా శ్రీధర్ తన టికెట్‌ను త్యాగం చేశారన్నారు. దీంతో ఈసారి ఆయనకు టికెట్ వస్తుందని అందరం ఆశించామన్నారు. ముఖ్యంగా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం కుటుంబానికి ఒక టికెట్ ఇవ్వాలని తీర్మానం చేసినా.. దానిని విస్మరించడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఖరారు చేయడంతో పాటు ఆయన కుటుంబంలో రెండో టికెటు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి నిదర్శనమన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరగదని తేలినందున.. పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకున్న బీసీ నేతను బలి చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
మేడ్చల్ జిల్లా జాయింట్ సెక్రటరీ సూర్యప్రకాశ్, మల్కాజిగిరి, మౌలాలి, వినాయక్‌నగర్ డివిజన్ల అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, సంతోష్‌కుమార్, గద్వాల వంశీ ముదిరాజ్, మీడియా కన్వీనర్ గుత్తి రాంచందర్, మైనారిటీ సెల్ చైర్మన్ మహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శి ఎంఆర్ శ్రీనివాస్ యాదవ్, లీగల్ అడ్వైజర్ బాలరాజు, రాములు, విట్టల్ ముదిరాజ్, కిరణ్‌కుమార్, నరసింహగౌడ్, బాలకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేణుగోపాల్, జాయింట్ సెక్రటరీ ఉదయ్‌బాబు, యూత్ అధ్యక్షుడు రెబ్బ వాసు, ఉపాధ్యక్షుడు చిట్యాల, అజయ్, రేవంత్నాయుడు, ఎన్ఎస్యూఐ సాయి, సాయిరాం, 140వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు నవనీత, మైనారిటీ వైస్ చైర్మన్ షహీన్ సుల్తానా, విజయలక్ష్మి, శివమ్మ, తదితరులు పాల్గొన్నారు.
‘మైనంపల్లి’ తర్జనభర్జన
హైకమాండ్ ఎర్ర తివాచీ పరిచి టికెట్‌పై హామీ ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, శ్రేణులు పెద్ద షాక్ ఇవ్వడంతో మైనంపల్లి హన్మంతరావులో ఆందోళన మొదలైనట్లు తెలుస్తున్నది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత భారీ ర్యాలీతో మల్కాజిగిరిలో హంగామా చేద్దామని అనుకున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు చూసి మిన్నకున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన నగరానికి వచ్చిన తర్వాత తన వెంట ఉన్న అనుచరులే తప్ప మల్కాజిగిరి కాంగ్రెస్‌కు చెందిన వారెవరూ ఆయనను సంప్రదించకపోవడం గమనార్హం. దీంతో మంగళవారం పూర్తిగా ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నందికంటి శ్రీధర్‌తో పాటు మంగళవారం మూకుమ్మడి రాజీనామాలు జరగడంతో నియోజకవర్గంలో ముందుకు అడుగులు వేయడమెలా? అని మైనంపల్లి వర్గం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి తనతో పాటు ఒకరిద్దరు మినహా ఎవరూ రాక.. ఇటు చేరిన కాంగ్రెస్‌లో ఎవరూ లేక… రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైందనే అంతర్మథనంలో ఆయన వర్గం ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
అల్వాల్ సర్కిల్లో రాజీనామాలు
మల్కాజిగిరి, అక్టోబర్ 3 : అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం అల్వాల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తమ రాజీనామా పత్రాలను నందికంటి శ్రీధర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు డోలి రమేశ్, సీఎల్ యాదగిరి, సూర్యప్రకాశ్ రెడ్డి, శ్రీనివాస్, పవన్, శివశంకర్, సంజీవరెడ్డి, సత్యనారాయణ రాజు, ఫహీమ్, పద్మా, సుభాషిని తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలను విస్మరించింది
కాంగ్రెస్ పార్టీ బీసీలను విస్మరించింది. పార్టీ జెండా మోసి లాఠీ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొన్న నందికంటికి టికెట్ ఇవ్వక పోవడం అన్యాయం. శ్రీధర్‌తోనే పార్టీ క్యాడర్ ఉంది. శ్రీధర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం.
– గుత్తి రాంచందర్, మీడియా సెల్ కన్వీనర్
నమ్ముకున్న వారికి గుర్తింపు లేదు
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌కు పార్టీ టికెట్ నిరాకరించడం దారుణం. పార్టీని నమ్ముకున్న వారికి సరియైన గుర్తింపు లేకపోవడంతో మానసింగా కృంగిపోతున్నాం. నందికంటి శ్రీధర్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుంది.
– సంతోష్‌కుమార్, వినాయక్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీది తప్పుడు నిర్ణయం
మల్కాజిగిరి నియోజకవర్గం పార్టీ క్యాడర్ నందికంటి శ్రీధర్ వెంట ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. నందికంటికి టికెట్ ఇచ్చిఉంటే అభ్యర్థిని గెలిపించుకునే వారిమి. ప్రస్తుతం మల్కాజిగిరి సర్కిల్లో పార్టీకి మనుగడ కష్టం. కొత్త అభ్యర్థిని ఎంపిక చేయడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది.
– వి.శ్రీనివాస్ గౌడ్, మల్కాజిగిరి డివిజన్ అధ్యక్షుడు
క్యాడర్ ఆగ్రహంతో ఉన్నారు
మల్కాజిగిరి సర్కిల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం కాయం. పార్టీకి సేవలు చేసిన వారికి గుర్తింపు ఇవ్వకపోవడంతో పార్టీ క్యాడర్ ఆగ్రహంతో ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు తగిన బుద్ది చేప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నందికంటి శ్రీధర్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ మనుగడను కాపాడారు. జిల్లా అధ్యక్షుడికే టికెట్ ఇవ్వకపోవడంతో క్యాడర్ ఆగ్రహంతో ఉన్నారు.
– వంశీముదిరాజ్, మౌలాలి డివిజన్ అధ్యక్షుడు
నందికంటి వెంటే ఉంటాం
కాంగ్రెస్ పార్టీ కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వకపోవడంతో క్యాడర్ నిరుత్సాహంగా ఉన్నారు. క్యాడర్ అంతా నందికంటి వెంట ఉన్నారు. నందికంటి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కనీసం పార్టీ పెద్దలు పలుకరించలేదు. కాంగ్రెస్ పార్టీకి మల్కాజిగిరి నియోజకవర్గంలో జీవం పోసిన నందికంటిని పార్టీ పెద్దలు నిలువునా మోసం చేశారు. అందుకే రాజీనామా చేశాం.
– శ్రీనివాస్ యాదవ్, వినాయక్‌నగర్ డివిజన్ కార్యదర్శి