ఖైరతాబాద్, అక్టోబర్ 29: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చే నెల 24న ఢిల్లీలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మాల మహానాడు ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కేసును గతంలోనే సుప్రీం కోర్టు కొట్టివేసిందని, జాతీయ ఎస్సీ కమిషన్ సైతం తిరస్కరించిందని, అయినా, అగ్రకుల నాయకులు, పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకు వర్గీకరణ అంశాన్ని తీసుకు వస్తున్నారన్నారు. దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీలు వర్గీకరణను ఒప్పుకోవడం లేదని బీజేపీ పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్నదని గుర్తు చేశారు. అలాంటి క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మురుగన్, నారాయణస్వామిలు వర్గీకరణకు వత్తాసు పలుకుతూ కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్నారన్నారు. వారిని కేంద్ర ప్రభుత్వం ఆ పదవులను నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో మాలల శంఖారావం, మహాగర్జన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న, రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, మాలల ఐక్య వేదిక అధ్యక్షులు కిషన్, ప్రదీప్, కాశన్న పాల్గొన్నారు.