హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ రౌడీయిజం చేసి గెలిచారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ సంచలన విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం ముసుగులో అప్రజాస్వామిక పద్ధతిలో జరిగిన ఎన్నికలో ఓడిపోయినా నైతిక విజయం తనదేనని వ్యాఖ్యానించారు. తనకు ఓటేసి ఆదరించిన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, అవ్వాతాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక ఆడబిడ్డపై సీఎం, క్యాబినెట్ మంత్రులంతా కలిసి దౌర్జన్యానికి దిగడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షేక్‌పేట, బోరబండ, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, వెంగళరావునగర్ డివిజన్లలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ రౌడీలు దాడులకు దిగారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు పోలింగ్ బూత్‌లను ఆక్రమించి దొంగ ఓట్లు వేయించారని, యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైందని దుమ్మెత్తిపోశారు. గోపీనాథ్ లేకపోవ డాన్ని చూసి రౌడీలంతా ఎలుకల మాదిరిగా కలుగులోంచి బయటకు వచ్చి దౌర్జన్యాలకు దిగారని ధ్వజమెత్తారు. తాను నవ్వినా, భర్తను గుర్తుకు తెచ్చుకొని ఏడ్చినా అసహాస్యం చేయడం తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో అనేక రాష్ర్టాల్లో ఉప ఎన్నికలు జరిగాయని, కానీ ఎక్కడా జూబ్లీహిల్స్ మాదిరిగా దౌర్జన్యాలు, దాడులు జరగలేదని గుర్తుచేశారు. ఇక్కడ కాంగ్రెస్ గూండాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోయారని మండిపడ్డారు. ఏదేమైనా తనకు ఓటేసిన వారికి అండగా ఉంటానని, కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, ప్రజాసమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని భరోసాఇచ్చారు.