Hyderabad | చార్మినార్, మార్చి 15 : ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని, రోగులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రేవంత్ సర్కార్‌వి గాలి మాటలేనని అర్థమవుతుంది. ఇందుకు నిదర్శనం పేట్లబుర్జ్ మెటర్నిటీ హాస్పిటల్. గర్భిణీ స్త్రీలు సులువుగా పై అంతస్తుల్లో చికిత్సలు పొందాలంటే లిఫ్ట్‌ల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ ఆస్పత్రిలోని లిఫ్ట్‌లు ఎప్పుడు పని చేస్తాయో.. ఎప్పుడు ఆగిపోతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
ఈ మెటర్నిటీ హాస్పిటల్లో ప్రధానంగా మూడు లిఫ్ట్‌లు ఉన్నాయి. ఇందులో శస్త్ర చికిత్స అనంతరం గర్భిణీ, ప్రసూతి స్త్రీలను ఇతర వార్డుల్లోకి తరలించడానికి వినియోగించే ప్రధాన లిఫ్ట్‌తో పాటు ఔట్ పేషెంట్ విభాగంలోనూ మరో లిఫ్ట్ సేవలు అందిస్తుంది. ఉద్యోగులు, ఇతర అధికారులు, వైద్యులు వినియోగించుకోవడానికి అదనంగా మరో లిఫ్టు అందుబాటులో ఉంది. అయితే పేషెంట్లను తరలించే లిఫ్టులు కొన్ని సందర్భాల్లో మొరాయిస్తున్నాయి. సాంకేతిక కారణాలతో మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో గర్భిణి, ప్రసూతి మహిళలు, వారి అటెండర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది లిఫ్ట్‌లను వినియోగించకుండా.. ర్యాంపు, మెట్ల మార్గంలో పై అంతస్తులకు వెళ్తున్నారు. దీంతో గర్భిణీలు, ప్రసూతి స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లిఫ్టులు మొరాయిస్తే.. వెంటనే మరమ్మతులు చేపట్టడం లేదని రోగులు వాపోతున్నారు. టెక్నిషీయన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో.. ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. లిఫ్ట్‌ల మెయింటెనెన్స్ కంపెనీ ప్రతినిధులు వచ్చి లిఫ్ట్ మరమ్మత్తులను నిర్వహించిన అనంతరమే తిరిగి వాటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఏదేమైనా లిఫ్ట్ ఆగిపోయినప్పుడు ఆసుపత్రి సిబ్బంది ఎమర్జెన్సీగా తమకు తెలిసిన విధానం ద్వారా అందులోని పేషెంట్లను బయటకు తీస్తున్నారు. ప్రసూతి ఆసుపత్రి రెండు అంతస్తుల్లో చికిత్సలు కొనసాగిస్తున్నందున లిఫ్టుల వినియోగం, మరమ్మతులు జరిగినప్పుడు గర్భిణీ స్త్రీలకు సమస్యలు ఏర్పడుతున్నాయి.