అమీర్‌పేట్, నవంబర్ 24 : సనత్‌నగర్ ఈఎస్ఐసీ సూపర్‌స్పెషాలిటీ దవాఖానలోని ఎగ్జిట్ గేటుకు సమీపంలోని గ్రానైట్ టైల్స్‌ను తొలగిస్తుండగా లిఫ్ట్ తీగలు తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కుప్పకూలిన ఘటన సోమవారం సాయంత్రంజరిగింది. ఐదు, ఆరు అంతస్తుల్లో గోడలకు అతికించి ఉన్న గ్రానైట్ బండలను తొలగించే పనులను ఐదుగురు కార్మికులు చేపడుతున్నారు. గ్రానైట్ బండలను ఓపెన్ లిఫ్ట్ ద్వారా కిందకు తరలిస్తుండగా తీగలు తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ వేగంగా కిందకు దూసుకువచ్చింది.
సూపర్వైజర్ భానుచందర్ అక్కడికక్కడే మృతి చెందగా, రఘుపతి, మోహన్‌లకు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఈఎస్ఐసీ అత్యవసర విభాగానికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయాల పాలైన మల్లేశ్, మైసయ్యలకు ప్రాణాపాయం తప్పింది. ఎస్ఆర్నగర్ పీఎస్‌లో ఈ మేరకు కేసు నమోదు కాగా ఘటనా స్థలాన్ని డీఎంఓహెచ్ డాక్టర్ వెంకటి, ఎస్ఆర్నగర్ ఏసీపీ రాఘవేందర్రావు తదితరులు ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఇదిలా ఉంటే ఈఎస్ఐసీ వైద్య కళాశాల డీన్ డాక్టర్ శిరీష్‌కుమార్ చవాన్ మాట్లాడుతూ తీవ్ర గాయాలకు గురైన రఘుపతి, మోహన్‌లకు సూపర్ స్పెషాలిటీ దవాఖానలో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.