ఖైరతాబాద్, ఆగస్టు 6 : స్పైనల్ మస్కూలర్ అట్రోపి (ఎస్ఎంఏ) వ్యాధిపై అవగాహన కల్పిస్తూ క్యూర్ ఎస్ఎంఏ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద అవగాహన రన్, రైడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ రన్, రైడ్‌ను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, తెలంగాణ దివ్యాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, డైరెక్టర్ శైలేశ్ కొలను (హిట్ ఫేమ్)తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ.. ఎస్ఎంఏ అనేది అరుదైన వ్యాధి అని, దాని చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నదన్నారు. ఫార్మా కంపెనీలు సామాజిక బాధ్యతగా ఇలాంటి వ్యాధులకు మందులను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మాట్లాడుతూ ఎస్ఎంఏ బాధితులకు చికిత్స అందించేందుకు నిమ్స్ దవాఖానలో మెరుగైన న్యూరాలజీ విభాగం ఉందని, పిల్లలకు మెరుగైన చికిత్స అందించి వారికి సాంత్వన కలిగిస్తున్నామన్నారు.
దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ దివ్యాంగులకు అండగా నిలిచారని చెప్పారు. ఎస్ఎంఏ వ్యాధితో సుమారు రూ.3,500 మంది, స్పైనల్ కార్డ్ సమస్యతో ఐదు వేల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రతి నెల వారికి రూ.5వేల నుంచి రూ.10వేలకు పైగా మందులకే ఖర్చవుతుందని, దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఇలాంటి వారికి డిజేబులిటీ కిట్ పథకాన్ని రూపొందించి మందులు కూడా ఉచితంగా అందించాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎస్ఎంఏ బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలువాలని, తాను నిర్మించబోయే చిత్రాల్లో ఈ అంశాన్ని తీసుకుంటానని డైరెక్టర్ శైలేశ్ కొలను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీలక్ష్మి, మేజర్ జనరల్ ఏవీకే మోహన్, రేయిన్బో పిల్లల హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేశ్ , దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. శైలజ తదితరులు పాల్గొన్నారు.