CP Sudheer Babu | సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ‘ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దాం’..అంటూ యువతకు రాచకొండ సీపీ సుధీర్‌బాబు పిలుపునిచ్చారు . ఈ మేరకు ఆయన యువతకు వీడియో సందేశాలను పంపిస్తున్నారు. అందులోని సారాంశం ఇలా ఉంది…‘తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని, పరీక్షలో ఫెయిల్ అయ్యారని, తక్కువ మార్కులు వచ్చాయని, లవ్ ఫెయిల్ అయ్యిందని ఇలా చిన్న చిన్న కారణాలు.. డిప్రెషన్.. ఆవేశపూరిత మనస్తత్వాలు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి..
ఓ యువత ఆగండి.. ఆలోచించండి… జీవితంలో పరీక్షలు మళ్లీ వస్తాయి.. కానీ నీవు లేకపోతే నీ తల్లిదండ్రులకు నీలాగా ఇంకెవ్వరు రారు. నీవు అనుకుంటున్న సమస్యలు 90 శాతం నీ ఊహ మాత్రమే… నీవు ఏదో సాధించడానికే భూమి మీదకు వచ్చావు. నీవెంటో నిరూపించుకునే సత్తా నీలో ఉంది.. నీ గెలుపును ఆపగలిగేవాడు ఎవడూ లేడు.. ఈ దేశానికి మీరే వెన్నముక… రండి ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దాం’ అంటూ సీపీ సందేశాన్ని పంపిస్తున్నారు.
నేటి నుంచి ఉద్యోగుల అంతర్గత బదిలీలు
సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర స్థాయి బదిలీల ప్రక్రియ ముగియడంతో అన్ని శాఖల్లో వరుసగా మూడేండ్లకు పైబడి తిష్ట వేసిన ఉద్యోగులు, అవినీతి ఆరోపణలు ఉన్న వారికి స్థానచలనం కల్పించాలని కమిషనర్ ఆమ్రపాలి నిర్ణయించారు. ఈ మేరకు బదిలీలు అత్యంత పారదర్శకంగా జరిపే ఉద్దేశంతో నలుగురు అదనపు కమిషనర్లతో కూడిన కమిటీని వేశారు. ఈ కమిటీ కమిషనర్‌కు నివేదిక సమర్పించగా, నేడు, రేపు బదిలీల ప్రక్రియను ముగించేలా కసరత్తును పూర్తి చేశారు. శానిటేషన్, టౌన్ ప్లానింగ్, హెల్త్, ఆర్థిక శాఖలో భారీగా బదిలీలు ఉండనున్నాయి.
‘ఇన్నోవేషన్ గాలా -2024’ అవార్డులు
సిటీబ్యూరో: కృత్రిమ మేధస్సు పరిజ్ఞానంతో వినూత్న ఆవిష్కరణలు చేసే వారిని ప్రోత్సహించేందుకు హైసీయా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్‌తో కలిసి టీ హబ్ కేంద్రంగా ఇన్నోవేషన్ గాలా-2024 అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఏఐతో కొత్త ఆవిష్కరణలు చేసే వారి నుంచి మ్యాథ్ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరిన్ని వివరాలకు ఈ కింది లింకు( https://mathub.ai/innovation-gala-2024/)లో సంప్రదించాలని, ఆగస్టు 20లోగా దరఖాస్తులను పంపించాలని సూచిస్తోంది.