ఖైరతాబాద్, ఏప్రిల్ 26 ఆకారణంగా తనపై దాడి చేసి కొట్టి, అవమానించిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పష్టం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 6న కుంభమేళాకు వెళ్లి తిరిగి వచ్చానని, 7న 20 మంది దుండగులు తన ఇంట్లోకి ప్రవేశించి రామరాజ్య స్థాపనకు తమతో కలిసి రావాలని ఒత్తిడి చేశారని, అందుకు నిరాకరించిన తనపై విచక్షణా రహితంగా దాడిచేసి కొట్టారన్నారు.
తన తర్వాత తమ టార్గెట్ చిన్నజీయరు స్వామి అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయారన్నారు. తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటు పలువురిని ఆరెస్టు చేశారని తెలిపారు. ప్రస్తుతం బెయిలపై వచ్చిన వీరరాఘవ రెడ్డి పలు యూట్యూబ్ చానెళ్లలో తనపై అసత్యపు ఆరోణలు చేస్తున్నాడన్నారు. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని, పరువునష్టం దావావేసి వారికి శిక్షపడే వరకు వదిలిపెట్టేది లేదన్నారు. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎం.మోహన్, నగర ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.