మన్సూరాబాద్: ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ గుండెపోటుతో చనిపోయారు. సీఐ వినోద్‌కుమార్ కథనం ప్రకారం.. మల్లాపూర్, జనప్రియ టౌన్షిప్లో నివాసముంటున్న ఎస్ఐ సంజయ్ సావంత్ (58) 1989లో కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2011లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2020లో ఏఎస్ఐగా, 2023లో ఎస్ఐగా పదోన్నతి పొందిన సంజయ్ సావంత్..రెండేండ్ల కిందట ఎల్బీనగర్ పీఎస్‌కు బదిలీపై వచ్చారు.
బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్‌లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల బందోబస్తుకు వెళ్లాల్సి ఉండటంతో పోలీస్‌స్టేషన్ పై అంతస్తులో ఉన్న బ్యారక్‌లో నిద్రించారు. ఉదయం సిబ్బంది.. సంజయ్ సావంత్‌ను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా, అపస్మారక స్థితిలో కనిపించారు. దవాఖానకు తరలించగా, పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గుండెపోటు కారణంగానే సంజయ్ సావంత్ మృతి చెంది ఉంటారని వైద్యులు తెలిపినట్లు సీఐ వెల్లడించారు.