సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి పనులు పట్టాలెక్కాలంటే భూముల విక్రయం జరగాల్సిందే అన్నట్లు ఉంది ప్రభుత్వ తీరు. గడిచిన ఏడాదిన్నర కాలంగా ప్రతిపాదనల్లో ఉన్న ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకురావాలంటే నిధుల సమీకరణ కీలకంగా మారిన నేపథ్యంలో…. ఈనెల 17 నుంచి మూడు రోజుల పాటు జరిగే భూముల వేలంపాటపై హెచ్ఎండీఏ గంపెడాశలు పెట్టుకుంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 90కిపైగా ప్లాట్లను వేలం వేయనుండగా… ఇందులో తుర్కంయాంజల్, బాచుపల్లి వెంచర్ ప్లాట్లు కీలకంగా మారాయి.
ప్రస్తుతం ఈ రెండు వెంచర్లకు సమీపంలో కమర్షియల్, రెసిడెన్షియల్ రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందడంతో.. అక్కడి ప్లాట్లకు భారీ ధరలు పలికే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో కోకాపేట్ తరహాలో ఈ భూములకు డిమాండ్ వస్తే గనుక మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధి గండిపేట్ మండలంలోని బైరాగిగూడ, కోకాపేట్, పుప్పాలగూడ శేరిలింగంపల్లిలోని చందానగర్తో పాటుగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో బాచుపల్లి, బౌరంపేట్, చెంగిచర్ల, సూరారం వంటి ప్రాంతాలలో డెవలప్ చేసిన 35,875 చదరపు గజాల భూమిని హెచ్ఎండీఏ వేలం నిర్వహించనున్నారు.
నగరంలో గడిచిన ఏడాదిన్నర కాలంలో రియల్ ఏస్టేట్ మార్కెట్ కుప్పకూలింది. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులు మార్కెట్లో ఉన్నా… క్రయవిక్రయాలు లేవు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నిర్వహించనున్న భూముల వేలం మార్కెట్ పరిస్థితులను ప్రభావితం చేస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలంలో ప్లాట్లకు మంచి ధర పలికితే మార్కెట్ తీరు మారనుంది.
దీంతో నగరంలో కుంటుపడిన క్రయవిక్రయాలు మళ్లీ పుంజుకుంటాయి. ఇక హెచ్ఎండీఏ చేపట్టే ప్రాజెక్టులకు భారీ స్థాయిలో నిధులు అవసరం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులతో హెచ్ఎండీఏ చేపట్టిన భూముల వేలంపాట ప్రతిష్టాత్మకంగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మార్కెట్ తీరుతెన్నులపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలానికి మంచి ఆదరణ వస్తే క్రయవిక్రయాలు పెరిగే అవకాశం ఉంది. కొనుగోలుదారులు ఏ రకంగా కొనుగోళ్లకు ముందుకు వస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఇటీవల వేలంపాటకు సంబంధించి ప్రీ బిడ్ సమావేశాలను హెచ్ఎండీఏ అధికారులు నిర్వహించారు. తుర్కంయంజాల్, బాచుపల్లిలో రెండు ప్రీ బిడ్డింగ్ సమావేశాలకు అత్తెసరు ఆదరణ వచ్చింది. కొనుగోలుదారుల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఈ ప్రీ బిడ్డింగ్ సమావేశానికి ఆశించిన స్థాయిలో జనాల సందడి లేదు.
తుర్కంయంజాల్ కొంత మెరుగ్గానే ఉన్నా… బాచుపల్లి ప్రీ బిడ్డింగ్ సమావేశానికి వచ్చిన సంఖ్య అధికారులకు ఆందోళన కలిగించింది. అతి తక్కువ మంది ప్రీ బిడ్డింగ్ సమావేశంలో ఉండటంతో అధికారుల ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఈ స్థాయిలో జనాలు వస్తే అనుకున్నంత డిమాండ్ వేలంపాటకు రాదనే నిర్ధారణకు వచ్చారు. అదే గనుక జరిగితే వేలంపాటపై హెచ్ఎండీఏ పెట్టుకున్న ఆశలు ఆడియాశలుగా మారనున్నాయి.