సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా శంకుస్థాపన చేసిన ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు భూ సేకరణ చిక్కులు తొలగడం లేదు. మూడు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, కూల్చివేతలు ప్రారంభిస్తామని ప్రకటించినా… క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు ముందుకు సాగడం లేదు. పరిహారం విషయంలో మొదలైన సమస్యలు ఇంకా జటిలమైతూనే ఉన్నాయి. దీంతో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల పొడవైన మెట్రో కోసం ఆస్తుల సేకరణ ఓల్డ్ సిటీలో నత్తనడకన సాగుతోంది.
రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా పెండింగ్‌లో ఉన్న ఓల్డ్ సిటీ మెట్రోకు ఇంకా భూసేకరణ చిక్కులు పరిష్కారం కావడం లేదు. కొంతకాలంగా భూసేకరణలో ఎదురైన ఇబ్బందులతో ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోగా… తాజాగా మెట్రో పొడువును పెంచి చాంద్రాయణగుట్ట వరకు పొడిగించినా… క్షేత్ర స్థాయిలో ఉన్న పురాతన, చారిత్రక కట్టడాలు ప్రధాన ఆటంకంగా మారుతుండగా…. ప్రైవేటు భూముల విషయంలోనూ కొందరు బాధితులు కోర్టులను ఆశ్రయించారు. దీంతో మొత్తంగా గుర్తించిన 900 ఆస్తుల్లో ఇప్పటివరకు 220 వాటికే పరిహారం చెల్లించినట్లు మెట్రో వెల్లడించింది. కానీ మిగిలిన ఆస్తుల సేకరణ ఎప్పటి లోగా పూర్తవుతుందనేది ఇప్పటికీ
ప్రశ్నార్థకమే.
ఆరు నెలలు గడిచినా… అదే పరిస్థితి
ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ విషయంలో న్యాయపరమైన చిక్కులే ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఓవైపు ప్రభుత్వ యంత్రాంగం భూ యజమానులతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోవడమే ఇప్పుడు ప్రాజెక్టులో పురోగతి లేకుండా చేస్తుంది. ఇక నోటిఫై చేసిన ఆస్తులన్నింటినీ సేకరించేలా… పరిహారం అందజేసిన ఆస్తులను అప్పటికప్పుడు కూల్చివేస్తున్నారు. కానీ భూ యజమానుల నుంచి ఆశించినంత స్పందన రావడం లేదు. దీంతో ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకుండా పోతున్నది. ఇప్పటికే డీపీఆర్‌ను కేంద్రానికి చేరగా… అక్కడి నుంచి అనుమతులు వచ్చేలోపు భూసేకరణ పూర్తి చేస్తే తప్ప.. ప్రాజెక్టు వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి వచ్చే వీలు ఉండదు.