సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): తమ డైరీఫామ్‌లో పెట్టుబడి పెడితే అధిక రాబడి ఇస్తామంటూ అమాయక జనాలను నమ్మించి, వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసగించిన ఇద్దరు కొండపల్లి డైరీఫామ్ నిర్వాహకులను సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ కథనం ప్రకారం…కోకాపేట ప్రాంతానికి చెందిన వేముల సుబ్బారావు, వేముల కుమారిలు మరో వ్యక్తితో కలిసి 2022 జూన్‌లో కొన్ని దినపత్రికల్లో ‘బిజినెస్ ఆఫర్’ పేరుతో ప్రకటనలు ఇచ్చారు. గత 16 ఏండ్లుగా మంచి లాభాలతో నడుస్తున్న డైరీఫామ్‌లో పెట్టుబడి పెడితే మంచి రాబడి ఉంటుందంటూ జనాన్ని ఆకర్శించారు.
నెలకు రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు రాబడి వస్తుందని నమ్మబలికారు. ఆకర్శితులైన పలువురు పెట్టుబడిదారులు ముందుకు వచ్చి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. నిందితులు చూపించిన డైరీఫామ్, అందులోని పశువులు, పాల ప్రాసెసింగ్ యూనిట్‌ను చూసి నమ్మకం పెంచుకున్న పెట్టుబడిదారులు ఇతరులకు కూడా చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 41మంది నిందితుల వద్ద రూ.9కోట్ల వరకు పెట్టుబడిగా పెట్టారు. తీరా రోజులు గడుస్తున్నా రాబడి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు డైరీ ఫామ్ నిర్వాహకులైన వేముల సుబ్బారావు, కుమారీలను గురువారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.