వెంగళరావునగర్, ఏప్రిల్ 20 : పని మనుషులుగా నమ్మకంగా నటిస్తూ ఇద్దరు మహిళలు యజమాని ఇంటికే కన్నమేశారు. ఇంట్లోని బంగారమంతా మూట గట్టి ఉడాయించిన కిలేడీల కేసును ఎస్ఆర్నగర్ పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రలోని నవీ ముంబైకు చెందిన సునీత (35), పూజ (38) నగరంలోని రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఇండ్లల్లో పనికి కుదిరి చోరీలకు పాల్పడుతుంటారు. సికింద్రాబాద్, బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో పని కోసం ప్రయత్నిస్తుండగా కారు డ్రైవర్ పూల్‌చంద్ యాదవ్ పరిచయమయ్యాడు. అతను తనకు తెలిసిన వారున్నారని చెప్పి అమీర్‌పేట శాంతిబాగ్ అపార్ట్మెంట్స్ సమీపంలోని సీత సరోవర్ అపార్ట్‌మెంట్స్‌లో వ్యాపారి బి.రామ్‌నారాయణ్ ఇంట్లో పనికి కుదిర్చాడు. సునీత నమ్మకంగా పనిచేస్తూనే బీరువా తాళాలు గుర్తించింది. పూజను ఆధార్ కార్డు, చిరునామా వివరాలు చూపాలని కోరడంతో తన వద్ద లేవని వెనుదిరిగింది. ఆ మర్నాడు సునీత పని కోసం వెళ్లి యజమాని లేని సమయంలో బీరువా తాళాలు తెరిచి బంగారాన్ని కాజేసింది. ఖాళీ బాక్సులను వాషింగ్ మిషన్‌లో, మంచం కింద, కిచెన్ రూమ్‌లో పడేసి వెళ్లిపోయింది. అనంతరం తన స్నేహితురాలు పూజకు ఫోన్‌చేసి ఇద్దరూ కలిసి నాంపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లి రన్నింగ్ ట్రైన్ ఎక్కి పారిపోయారు. బాధితుడు బి.రామ్‌నారాయణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పనిలోకి కుదిర్చిన డ్రైవర్ పూల్‌చంద్ యాదవ్ అదుపులోకి తీసుకుని విచారించినా ఫలితం లేకుండాపోయింది.
చోరీకి పాల్పడిన మహిళల ఆధార్ కార్డులు, చిరునామాలు తెలియకపోవడంతో కేసు చిక్కుముడిలా మారింది. చోరీ చేశాక పూజకు సునీత ఓ ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి ఫోన్ చేసింది. ఆ నంబర్‌తో ట్రేస్ చేయాలని ప్రయత్నించినా అవి కూడా చోరీ చేసినవే కావడంతో క్లూ దొరకలేదు. ఈ నేపథ్యంలో ఇది పాత నేరస్తులే పనే అని భావించిన పోలీసులు పాత కథనాలను శోధించారు. బెంగుళూరులో ఓ పనిమనిషి పనిలో చేరిన మరుసటి రోజే ఇంట్లో చోరికి పాల్పడి పోలీసులకి చిక్కిన వార్తను ఎస్ఆర్నగర్ క్రైమ్ కానిస్టేబుల్ పవన్ సేకరించాడు. అందులోని నిందితురాలి ఫొటోలను బాధితులకు చూపడంతో వారు చోరీకి పాల్పడింది ఈ మహిళలేనని గుర్తించారు. దీంతో ముంబై, బెంగుళూరు క్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో ఆ మహిళలు నవీ ముంబైకు చెందిన వారిగా నిర్ధారణ అయింది. షోలాపూర్‌కు చెల్లి కూతురి పెళ్లి సంబంధం కోసమని వెళ్లిన సునీతతో పాటు పూజను ఓ ఇంట్లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కేసు వివరాలు మీడియాకు తెలిపే అవకాశముందని ఎస్ఆర్ నగర్ డీఐ రాంప్రసాద్ తెలిపారు.