కొండాపూర్, ఆగస్టు 6 : మూడేండ్ల చిన్నారి కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు. ఇన్స్పెక్టర్ కాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌లోని హుడా కాలనీలో నివాసముంటున్న రవిత గురువారం సాయంత్రం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి తారానగర్‌లోని కల్లు దుకాణానికి వెళ్లింది. కల్లు తాగిన అనంతరం మైకంలో అక్కడే మత్తులోకి జారుకున్నది. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న మూడేండ్ల సదీనా అపహరణకు గురైంది. బాలిక తండ్రి విర్నుష్కు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సై రాములు, క్రైమ్ సిబ్బంది జానకిరామ్, సాధిక్ అలీలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. కల్లు దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, చిన్నారిని ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో నివాసముండే లక్ష్మి (40) బాలికను అపహరించి.. అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసులు నిందితురాలిని పట్టుకున్నారు. దీంతో కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.