Khairatabad Ganesh | ఖైరతాబాద్, సెప్టెంబర్ 5 : ఏడుపడగల ఆదిశేషుడి నీడలో ఏడుపదుల అడుగుల్లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి నేత్రాలంకరణ గురువారం ఉదయం వేడుకగా సాగింది. శిల్పి చిన్నస్వామి రాజేంద్ర స్వామి వారికి నేత్రాలను అలంకరించారు. ఈ ఘట్టం పూర్తి కావడంతో సాయంత్రం విగ్రహం చుట్టూ ఉన్న కర్రలను తొలగించి భక్తులకు దర్శనానికి వీలు కల్పించారు.
75 అడుగుల కండువా..
శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతికి ఖైరతాబాద్ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 75 అడుగుల కండువా, జంధ్యం, గరికమాలను సమర్పించనున్నారు. శనివారం వినాయక చవితి రోజు విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవ క్రతువుల్లో వాటిని స్వామివారికి అలంకరించనున్నారు. నైపుణ్యవంతులైన నేత కార్మికులతో చేనేత కండువా, జంధ్యం, పట్టువస్ర్తాలను తయారు చేయించామని సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్ తెలిపారు.
ఈ మేరకు గురువారం సంఘం గౌరవ అధ్యక్షుడు గుర్రం కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామితో కలిసి వాటిని మీడియాకు ప్రదర్శించారు. వినాయకచవితి రోజు ఉదయం 7 గంటలకు రాజ్‌దూత్ చౌరస్తా నుంచి తెలంగాణ కళా రూపాలైన ఒగ్గుడోలు, గుస్సాడి నృత్యం, కోలాటాల మధ్య గుర్రపు బగ్గీలో వాటిని ఊరేగించి గణేశుడికి సమర్పిస్తామన్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఐఏఎస్ అధికారులు పార్థసారధి, చిరంజీవులు, వెంకటేశ్ నామాని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్, డీసీపీ రావిరాల వెంకటేశ్వర్లు, మాజీ అడ్వకేట్ జనరల్ శివానంద ప్రసాద్, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్, టీఎస్టీఎస్ ఎండీ శంకరయ్య, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యదర్శి బేతి రాజేశం, పోస్టల్ సర్వీస్ డైరెక్టర్ కైరంకొండ సంతోష్ నేత, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్, ఐఅండ్‌పీఆర్ మాజీ డైరెక్టర్ రాజమౌళి తదితరులు హాజరవుతున్నారన్నారు.