Khairatabad | ఖైరతాబాద్, డిసెంబర్ 18 : మళ్లీ మునుపటి రోజులు గుర్తుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఖైరతాబాద్ ఇందిరానగర్‌లోని డబుల్ గృహాల సముదాయంలో తాగునీటికి కటకట ఏర్పడింది. ఐదు రోజులుగా జలమండలి నుంచి నీటి సరఫరా నిలిచిపోయినా.. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రోజు అవసరాలు, తాగునీటికి నివాసితులు ఇబ్బందులుపడుతున్నారు. రోజుల తరబడి విజ్ఞప్తుల మేరకు ఎట్టకేలకు బుధవారం ట్యాంకర్లు పంపించడంతో ఒక్కసారిగా సుమారు 210 గృహాలకు చెందిన నివాసితులు నీటి కోసం ఇంట్లో ఉన్న బిందెలు…బకెట్లు…వాటర్ క్యాన్లతో పరుగులు తీశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ తమకు నీటి కష్టాలు మొదలయ్యాయి అంటూ..నిట్టుర్చారు.
ఒక్కసారిగా..
ఖైరతాబాద్ డబుల్బెడ్రూం గృహ సముదాయానికి ఒకసారి రోజు విడిచి రోజు, అప్పుడప్పుడూ రెండు రోజుల కోసారి నల్లా నీరు వచ్చేది. శనివారం నుంచి ఒక్కసారిగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మూడు రోజులు గడిచినా.. నీరు రాకపోవడంతో జలమండలి అధికారులను సంప్రదించగా, రెడ్‌హిల్స్ వద్ద మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ఇంకా టైమ్ పడుతుందని చెప్పారు. డబుల్ బెడ్రూం సముదాయంలో ఏ బ్లాకులో 30, బీ బ్లాకులో 80, సీ బ్లాకులో 40, డీ బ్లాకులో 60 ఇండ్లు ఉన్నాయి. ఏ, బీ బ్లాకులకు 50వేల లీటర్లు, సీ, డీ బ్లాకులకు కలిపి 30వేల లీటర్ల సంపు నిర్మించారు. అన్ని గృహాలకు కలిపి ఒకే ఒక్క బోరు ఉండటంతో పాటు బీ బ్లాకుపై ఒకే ఒక్క 18వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకు ఉంది. దీంతో జలమండలి ద్వారా వచ్చే నీటిపైనే వందలాది కుటుంబాలు ఆధారపడ్డాయి. నీటి సరఫరా నిలిపివేసిన జలమండలి..ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో నీటి కోసం గోసపడటం నివాసితుల వంతైంది.
ఎన్నడూ పట్టించుకోని ఎమ్మెల్యే..
గత ఏడాది కాలంగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్న డబుల్ బెడ్రూం గృహ నివాసితులు తమ సమస్యను గతేడాది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పవర్ బోరు వేయించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మరోసారి ఇటువైపు కన్నెత్తి చూడలేదని..స్వయంగా వెళ్లి కలిసినప్పుడు రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ గాలి మాటలు చెబుతున్నారని గృహ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేవలం పేరుకే ఉన్నారని, తమ గోడును ఎన్నడూ పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపిస్తున్నారు.
రెడ్‌హిల్స్ ఎఫెక్ట్….
ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్ నుంచి రెడ్‌హిల్స్‌కు వచ్చే తాగునీటి పైపులైను వారం రోజుల కిందట పగిలిపోయింది. జలమండలి అధికారులు నామమాత్రంగా సమాచారం ఇచ్చి సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పైపులైపు పగిలిన నేపథ్యంలో ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని అనేక కాలనీలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఒక్కొక్క కాలనీలో నీటి సరఫరాను పునరుద్ధరిస్తూ వస్తున్న అధికారులు డబుల్ గృహాలపై దృష్టి పెట్టలేదని ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఎక్కడా వెళ్లలేని పరిస్థితుల్లో ఖైరతాబాద్ ఇందిరానగర్ డబుల్ గృహాల్లో నివాసం ఉంటున్న 200 కుటుంబాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నాయి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు…
ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాల్లో గత ఐదురోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. పైపులైన్లు దెబ్బతిన్న విషయాన్ని ముందుస్తుగా చెప్పాల్సిన అధికారులు సమాచారం ఇవ్వలేదు. నాలుగు రోజులు గడిచిన తర్వాత ఫోన్ చేస్తే విషయాన్ని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఫోన్లు చేసినా నిర్లక్ష్యం వహించారు. ఐదు రోజుల తర్వాత ట్యాంకర్‌ను పంపించారు. అది కూడా రెండు మాత్రమే ..ఆ నీరు 200 కుటుంబాలకు ఏ మాత్రం సరిపోలేదు. డబుల్ బెడ్రూం బీ బ్లాకులో మరో 18వేల లీటర్ల ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించే అవకాశం ఉన్నా అటు ఎమ్మెల్యే, ఇటు సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
– అనిల్ కుమార్, అధ్యక్షుడు, 2బీహెచ్‌కే డిగ్నిటీ వెల్ఫేర్ అసోసియేషన్.