Khairatabad Ganesh | ఖైరతాబాద్, జూన్ 15 : ఖైరతాబాద్ శ్రీ గణేశ్ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. ఖైరతాబాద్ గణేశ్ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేందర్ బాబు, కోశాధికారి మహేశ్ యాదవ్ వివరాలు వెల్లడించారు. 1954లో దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు సింగరి శంకరయ్య స్థానిక బస్తీ వాసులను కలుపుకొని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీని స్థాపించారని, తొలుత ఒక్క అడుగు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారన్నారు. ప్రతి ఏడాది ఒక్కో అడుగు పెంచుతూ.. 60 అడుగుల విగ్రహాన్ని సైతం ప్రతిష్ఠించినట్లు చెప్పారు. శంకరయ్య మరణానంతరం ఆయన సోదరులు సింగరి నరసింహ, సింగరి సుదర్శన్ స్థానికుల సహకారంతో ఉత్సవాలను నిర్వహిస్తూ వచ్చారన్నారు.
2017-18 సంవత్సరంలోనే అప్పటి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సమక్షంలో నూతన కమిటీ ఏర్పాటు చేయాలని కోరామని, తిరిగి 2021-22 సంవత్సరాల్లో ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకురాగా, అప్పటి చైర్మన్ సింగరి సుదర్శన్ తాను బతికున్నంత కాలం కుటుంబసభ్యులు, బస్తీ వాసులను కలుపుకొని ఉత్సవాలను నిర్వహించాలని కోరారన్నారు.
2022లో సుదర్శన్ మరణానంతరం బస్తీలోని ముఖ్య నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కలిసి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని కోరామని, ఉత్సవ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉన్న సింగరి రాజ్ కుమార్ ఈ ఒక్కసారిగా తమ కుటుంబసభ్యులు, బస్తీవాసులతో కలిసి నిర్వహిస్తామని చెప్పారన్నారు.
తాజాగా సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి పాత కమిటీపై ఆరా తీయగా, ఆ కమిటీ అస్థిత్వంలో లేదని చెప్పారని, దీంతో ఖైరతాబాద్ శ్రీ గణేశ్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశామని, చైర్మన్‌గా దివంగత సింగరి సుదర్శన్ కుమారుడు సింగరి రాజ్ కుమార్‌ను, అధ్యక్షులుగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఈ కొత్త కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది నవరాత్రోత్సవాలను నూతన కమిటీ ద్వారానే చేసేందుకు సింగరి రాజ్‌కుమార్ ఒప్పుకున్నారని, అందులో భాగంగానే సోమవారం కర్రపూజ వేడుకలతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్ కృష్ణా యాదవ్, చందు, ప్రవీణ్ కుమార్, మధుకర్ యాదవ్, రవికాంత్‌రెడ్డి, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.