ఖైరతాబాద్, ఫిబ్రవరి 14 : మరు తండ్రి మందలించాడని ఆరేండ్ల వయస్సులో నగరం నుంచి కేరళకు వెళ్లిపోయిన ఓ బాలుడు పెరిగి పెద్దయ్యాడు. దాదాపుగా 25 ఏండ్లు ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ రోజులు గడుపుతున్న అతను.. అనుకోని పరిస్థితుల్లో కేరళలోనే ఇటీవల అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అక్కడి పునరావాస కేంద్రంలో తిరిగి కోలుకొని తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరువేసుకుంటున్నాడు. ఈ వివరాలన్నింటినీ నమోదు చేసుకొని కేరళ పోలీసులు.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను చేర్చేందుకు నగర పోలీసులకు సమాచారం అందించారు.
కేరళ పోలీసులు అందించిన సమాచారం మేరకు పంజాగుట్ట డీఐ శ్రవణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన విక్కీ అనే వ్యక్తి తన ఆరేండ్ల వయస్సులో మారు తండ్రి మందలించడంతో స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న రైలు ఎక్కాడు. కేరళకు చేరుకొని దొరికిన పనులు చేసుకుంటూ పెద్దయ్యాడు. ఇటీవల రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని కేరళా పోలీసులు రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. అక్కడ తనకు గతం గుర్తుకు రాగా పోలీసులకు వివరాలు వెల్లడించాడు.
తన పేరు విక్కీ అని, తల్లి రెండో వివాహం చేసున్నదని, అతను మందలించడం వల్లే కోపంతో రైలు ఎక్కి వెళ్లిపోయాయని తెలిపాడు. మొదటి తండ్రి పాల వ్యాపారం, తన తల్లి రెండో భర్త ఆటో రిక్షా నడిపిస్తుంటాడని, తల్లి పేరు గీత అని, అతని అక్కా, చెల్లెలు పూజా, భారతి ఉన్నారని పేర్కొన్నాడు. తన ఇంటి దగ్గర నాగదేవత గుడి, ఒక మసీదు ఉంటుందని, సమీపంలోనే తన నానమ్మ ఇల్లు కూడా ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు అతను చెప్పిన చిరునామా, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నారు. ఈ మేరకు అతని ఒరిజినల్ ఫొటోతో పాటు ఏఐతో రూపొందించిన చిన్నప్పటి ఫొటోను విడుదల చేశారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని డీఐ తెలిపారు.