కీసర, జూన్ 22 : రెండేళ్ల బాలుడి మర్డర్ కేసును ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశామని ఏసీపీ చక్రపాణి తెలిపారు. సోమవారం కీసర పోలీసుస్టేషన్లో ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట్ జిల్లా తీగల్ ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ రంగస్వామి కీసర సర్కిల్ చీర్యాల్‌లోని ఈడెన్ గార్డెన్లో తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.
తన కుమారుడు మాస్టర్ రంగా హరికృష్ణ (2) అనుమానాస్పదస్థితిలో మరణించిన్నట్లు ఈనెల 13న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో గత నెల 29న మృతుడి తల్లి రంగా జ్యోతి తన కుమారుడు పడిపోవడం వల్ల ఆపస్మారక స్థితిలోకి వెళితే దవాఖానకు తరలిస్తే అప్పటికే మృతిచెందిన్నట్లు వైద్యులు నిర్థారించారని తెలపడంతో అనుమానం వచ్చిన స్వామి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ పుటేజీలు, సాక్ష్యుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడు ముగిళ్ల నవీన్‌కు రంగా జ్యోతికి వివాహేతర సంబంధం ఉన్నట్లు వెల్లడైందని, సంఘటన జరిగిన రోజు నిందితుడు నవీన్, జ్యోతిలు కలిసి బాలుడి గొంతు నులిపి చంపేశారని వారిద్దరు ఒప్పుకున్నారని తెలిపారు.
ఈనెల 19న తీగల్లో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోరెనిక్స్ పరీక్షలు నిర్వహించామన్నారు. వారిద్దరి వివాహేతర సంబంధానికి మృతుడు అడ్డుగా ఉన్నాడని బాలుడిని హత్య చేసిన్నట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. హత్య కేసులో యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధాపూర్‌కు చెందిన మొగుళ్ల నవీన్ (28), రంగా జ్యోతిలను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు, ఎస్సైలు హరిప్రసాదవ్, శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.