నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీలో సభ్యుడిగా, కేసీఆర్ వీరాభిమానిగా, మాజీ ప్రభుత్వ ప్లీడర్‌గా సేవలందించిన ప్రముఖ న్యాయవాది పి.శివకుమార్దాస్ (57) అకాల మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి మాజీ చైర్మన్ తన్నీరు రంగారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన మరణం న్యాయవాద సంఘాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించిందని, సిటీ సివిల్ కోర్టుకు చెందిన న్యాయవాదులతోపాటు ఇతర కోర్టులకు చెందినవారు సోమవారం ఆయన అంతిమయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వ ప్లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. ఆయన సేవలు న్యాయవాద వృత్తికి, తెలంగాణ ఉద్యమానికి చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో హఠాన్మరణం చెందారన్నారు. హైదరాబాద్‌లోని పూల్‌బాగ్ ప్రాంతంలో భార్య, కూతురు, కుమారుడితో నివాసం ఉంటున్నారన్నారు. బీఆర్ఎస్ లీగల్‌సెల్ సభ్యులు మాణిక్ ప్రభుగౌడ్, తిరుమల్‌రావు, కొంతం గోవర్ధన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలుగడ్డల అనిల్, ఉపేందర్, లక్ష్మణ్గంగా, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్, ప్రధాన కార్యదర్శి అజటే, ఉపాధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.