సిటీబ్యూరో, జనవరి 7 ( నమస్తే తెలంగాణ ) : ప్రశ్నలతో సవాల్ విసురుతూ.. జవాబులు చెబుతుంటే చప్పట్లు, ప్రశంసలు కురిపిస్తూ.. ‘హిందీ క్విజ్’ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘కౌన్ బనేగా జ్ఞాని’ అంటూ 60మంది విద్యార్థినులకు నిర్వహించిన క్విజ్ పోటీ క్షణ క్షణం ఉత్కంఠను తలపించింది. అచ్చం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ రియాలిటీ షోను వీక్షిస్తున్న అనుభూతి కలిగించింది. వినోదంతో పాటు విజ్ఞానం పంచే ఈ క్విజ్ పోటీలకు అబిడ్స్‌లోని సెయింట్ జార్జెస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వేదికైంది. కాలేజీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా హిందీ విభాగం ఆధ్వర్యంలో ‘కౌన్ బనేగా జ్ఞాని’ కార్యక్రమం నిర్వహించారు. బుల్లితెర రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి మాదిరిగానే ల్యాప్‌టాప్‌లు, బ్యాక్‌గ్రౌండ్, హాట్‌సీట్, హోస్ట్, మ్యూజిక్, చుట్టూ ప్రేక్షకులు ఇలా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఆ షోలో బిగ్‌బీ అమితాబ్ హోస్ట్ చేయగా ఈ షోలో హిందీ లెక్చరర్ శోభా దేశ్‌పాండే హోస్ట్ చేశారు. ఆద్యంతం ఎంతో ఉషారుగా నవ్విస్తూ.. ప్రోత్సహిస్తూ.. ప్రేక్షకులకు వినోదం పంచుతూ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలతో ‘జ్ఞాని’ని అన్వేషించారు. ఒకరి తర్వాత ఒకరు హాట్సీట్లో కూర్చోవడానికి అమ్మాయిలు పోటీపడ్డారు. ఒక్కొక్కరికి 25 నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. ‘కంప్యూటర్ జీ, లాక్ కియాజాయే వంటి పదాలతో ఆకట్టుకున్నారు.
వినోదంతో పాటు విజ్ఞానం పంచాలనే..
కాలేజీ ప్రిన్సిపాల్ కారోలిన్ మాట్లాడుతూ కాలేజీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం పంచాలనే ఉద్దేశంతో ‘కౌన్‌బనేగా జ్ఞాని’ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. విద్యార్థులకు ప్రేరణ కలిగించేలా.. కార్యక్రమాలు నిర్వహిస్తే విశేష స్పందన వస్తుందని తెలిపారు. అనంతరం హిందీ విభాగం హెడ్ శోభా దేశ్‌పాండే మాట్లాడుతూ టీవీలో వచ్చిన కౌన్ బనేగా కరోడ్ పతి మాదిరిగానే క్విజ్ పోటీ నిర్వహించామని చెప్పారు. విద్యార్థులు చాలా సంతోషంగా పాల్గొన్నారని అన్నారు. వారందరికీ ప్రశంసాప్రతాలు అందించారు.