తెలుగు యూనివర్సిటీ, జూన్ 16. ప్రఖ్యాత కథక్ నృత్య కళాకారిణి, నాట్యగురు మంగళాభట్ (62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం మ ధ్యాహ్నం 12.15 గంటలకు హైటెక్ సిటీలోని సింధు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ సతీమణి మంగళాభట్! విఖ్యాత జానపద కళాబ్రహ్మ గోపాల్ రాజ్ భట్ కోడలు. ఆకృతి కథక్ కళాకేంద్రం పేరుతో 35 ఏళ్లుగా హైదరాబాద్ లో ఎందరో శిష్యులను కథక్ నాట్యంలో తీర్చిదిద్దారు. ఆమె భర్త రాఘవరాజ్ భట్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో లెక్చరర్ గా సేవలు అందిస్తున్నారు. కథక్ నృత్యంలో ఎ న్నో ప్రయోగ ప్రదర్శనలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కారం స్వీకరించారు.
మంగళాభట్ మహారాష్ట్ర కొల్హపూర్ బిడ్డ! ఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కథక్ కేంద్రంలో రాజస్థాన్ జైపూర్ ఘరానాలో తొలుత కుందన్ లాల్ గంగాని దగ్గర, అనంతరం పండిట్ దుర్గాలాల్ దగ్గర శిక్షణ పొందారు. గంధర్వ యూనివర్సిటీలో విశారద చేశారు. ఢిల్లీలోనే పండిట్ బిర్జు మహారాజ్ దగ్గర లక్నో ఘరానా లో కథక్ నేర్చుకుంటున్న రాఘవ రాజ్ భట్ తో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.
దంపతులిద్దరూ వేర్వేరు ఘరానాలతో చేసే జుగల్ బందీ కథక్ విశేషంగా కళాప్రియులకు నచ్చింది! ఢిల్లీలోనే ఆమె సంగీత భారతిలో, రాఘవరాజ్ సంగీత నాటక అకాడమీలో కథక్ టీచర్లుగా ఉద్యోగాలు పొందారు. కొన్నాళ్లు అక్కడ చేశాక డిప్యూటేషన్ పై రాఘవరాజ్ హైదరాబాద్ వచ్చి ప్రభుత్వ సంగీత కళాశాలలో చేరారు. ఆమె హైదరాబాద్ వచ్చి 1990లో ఆకృతి కథక్ కేంద్రం ప్రారంభించారు.
మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, మిథిలానగర్ లో గల గృహంలో కళా ప్రేమికుల సందర్శనార్థం ఉంచి, జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో మధ్యా హ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.