బంజారాహిల్స్,మే 26: కన్నప్ప సినిమా కీలక గ్రాఫిక్స్ డాటాతో ఉన్న హార్డ్‌డ్రైవ్ మాయమవడంలో ఇద్దరు ఉద్యోగులపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ పేరుతో భారీ బడ్జెట్ చిత్రం నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించి ముంబయిలోని ఓ వీఎఫ్ఎక్స్ సంస్థ కొన్ని గ్రాఫిక్స్ రూపొందించింది.
ఆ గ్రాఫిక్స్, డేటా ఫైల్స్‌తో కూడిన హార్డ్‌డిస్క్‌ను డీటీడీసీ కొరియర్లో మార్చి 25న ఫిలింనగర్‌లోని సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న కాంతి అనే వ్యక్తి పేరుతో పంపించారు. అయితే ఆ సమయంలో కాంతి అందుబాటులో లేకపోవడంతో దాన్ని డెలివరీ తీసుకున్న ఆఫీస్ బాయ్ అదే ఆఫీస్‌లో పనిచేస్తున్న చరిత అనే ఉద్యోగికి అప్పగించారు. అయితే ఈ విషయాన్ని దాచి పెట్టడంతో తమకు రావాల్సిన డెలివరీ రాలేదంటూ సంస్థ ప్రతినిధి కాంతి డీటీడీసీ ప్రతినిధులను సంప్రదించారు.
కొరియర్ డెలివరీ అయిందని రఘు అనే వ్యక్తి సంతకం కూడా చేశాడంటూ తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని గురించి రఘుతో పాటు చరితను నిలదీయగా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. సినిమా విడుదల సమయంలో సమస్యలు సృష్టించేందుకు అదృశ్య శక్తుల ప్రోద్భలంతో చరిత, రఘు తదితరులు సినిమాకు సంబంధించిన కీలక డేటా ఉన్న హార్డ్‌డ్రైవ్ అంశంలో నమ్మక ద్రోహానికి పాల్పడ్డారంటూ సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్‌కుమార్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.