హిమాయత్‌నగర్,అక్టోబర్9 : విప్లవ పోరాట యోధుడు చేగువేరా జీవితం యువతకు ఆదర్శమని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర, రాష్ట్ర కార్యానిర్వహక అధ్యక్షుడు ఎన్. శ్రీకాంత్,నగర అధ్యక్షుడు ఆర్.బాలకృష్ణ అన్నారు. చెగువేరా వర్ధంతి సందర్భంగా గురువారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్ వద్ద చెగువేరా చిత్ర పటానికి పలు వురు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెరిల్లా పోరాటాన్ని ఉధృతం చేసి ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి చేసిన గొప్ప యోధుడు చేగువేరా అని కొనియాడారు. సామాజిక పురోగతికి సోషలిజమే మార్గమన్నారు.
క్యూబా దేశంలో విద్య, వైద్యం ఉచితమని, ఈ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. చెగువేరా ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ అసమానతలు లేని సమసమాజ నిర్మాణం కోసం యువత పాటు పడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర ఉపాధ్యక్షుడు కాంపల్లి కల్యాణ్, నేతలు అరుణ్, సుశాంత్, ప్రతిమ, రమ్య, శాంతి, ఫాతిమా, ప్రదీ ప్, నదీమ్, ప్రభాకర్, సంజీవ్ పాల్గొన్నారు.